Telugu Global
Telangana

పేరుమార్పు రాజకీయం.. బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశం

గతంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. భైంసా పేరును మహీషగా మారుస్తామని కూడా ఆయన చెప్పారు. నిజామాబాద్ పేరుని ఇందూరుగా మార్చాలని గతంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

పేరుమార్పు రాజకీయం.. బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశం
X

బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటున్నా, ఎస్సీ వర్గీకరణకు సై అంటున్నా.. అంతర్గతంగా బీజేపీకి హిందూ ఓట్ల పోలరైజేషన్ అనేది ముఖ్యమైన పాయింట్. అందుకే ఆ పార్టీ ఎక్కడలేని జిమ్మిక్కులు చేస్తుంది. తాజాగా మేనిఫెస్టోలో తెలంగాణలో పలు నగరాల పేర్లు మారుస్తామనే అంశాన్ని పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈనెల 16న బీజేపీ మేనిఫెస్టో విడుదలవుతున్న వేళ, పేరుమార్పు లీకులు ఆసక్తికరంగా ఉన్నాయి.

మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేసింది బీజేపీ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌ గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌ గా పేరు మార్చింది కేంద్రం. మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి ఉండటంతో అక్కడ ఆ పని సులువుగా జరిగింది. రేపు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే కొన్ని నగరాల పేర్లు మార్చేస్తామని అంటోంది బీజేపీ. ఆ హామీని మేనిఫెస్టోలో కూడా పొందు పరుస్తోంది.

గతంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. భైంసా పేరును మహీషగా మారుస్తామని కూడా ఆయన చెప్పారు. నిజామాబాద్ పేరుని ఇందూరుగా మార్చాలని గతంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పేరు మార్పు వ్యవహారాలన్నీ ఇప్పుడు మేనిఫెస్టో హామీలుగా తెరపైకి రాబోతున్నాయి. జాబ్‌ క్యాలెండర్‌, ఉపాధి అవకాశాలపై హామీలు కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉంటాయని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ అంశాన్ని బీజేపీ టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. తెలంగాణలో ఈ హామీ ఇస్తే.. కచ్చితంగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అది మినహా మిగతా హామీలన్నీ బీజేపీ ఇచ్చేట్టుగా ఉంది.

First Published:  13 Nov 2023 6:45 AM GMT
Next Story