Telugu Global
Telangana

కుర్చీ కోసం లొల్లి.. కొట్లాడుకున్న బీజేపీ నాయకులు

ఇంత చేస్తే ఆ నాయకులు గొడవ పడింది ఎమ్మెల్యే టికెట్ కోసమో.. పార్టీ పదవి కోసమే కాదు.

కుర్చీ కోసం లొల్లి.. కొట్లాడుకున్న బీజేపీ నాయకులు
X

ఒక ఎంపీ ముందే నాయకులు తిట్టుకున్నారు. మాకు ఇవ్వాలంటే.. మాకివ్వాలంటూ ఘర్షణకు దిగారు. వివాదం పెరగడంతో చివరకు కొట్టుకునే వరకు వెళ్లారు. ఇంత చేస్తే ఆ నాయకులు గొడవ పడింది ఎమ్మెల్యే టికెట్ కోసమో.. పార్టీ పదవి కోసమే కాదు. మీటింగ్‌లో ఏర్పాటు చేసిన కుర్చీ కోసం. భైంసా బీజేపీ కార్యాలయంలో ఈ గొడవ జరిగింది. మిగిలిన పార్టీలకు తాము ఏ మాత్రం తీసిపోమని బీజేపీ నాయకులు కూడా నిరూపించారు. ఏకంగా ఎంపీ సోయం బాపూరావు ముందే నాయకులు కుస్తీలు పట్టారు. కుర్చీ కోసం ఇంత లొల్లి జరుగుతుండటం చూసి అక్కడి నాయకులు అవాక్కయ్యారు.

భైంసాలో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. దీనికి ఎంపీ సోయం బాపూరావు ముఖ్య అతిథిగా వచ్చారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కొంత మంది నాయకులకు కుర్చీలు దొరకలేదు. ఓబీసీ నాయకులకు కుర్చీలు వేయరా అంటూ.. ఓబీసీ మోర్చా ఎగ్జిక్యూటీవ్ మెంబర్ బాజీరావు, అసెంబ్లీ కన్వీనర్ సాయినాథ్‌ల మధ్య కుర్చీ కోసం కొట్లాట జరిగింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఓబీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.

అక్కడే ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు ఈ గొడవపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ ముదురుతుండటంతో ఎంపీ సోయం బాపూరావు రంగంలోకి దిగి ఇరు వర్గాల నాయకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పుకునే బీజేపీలో ఇలా కుర్చీ కోసం కొట్లాడుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇతర నాయకులు కూడా వారిని సముదాయించడంతో అక్కడికి సద్దుమణిగింది.

కాగా, భైంసాలో కుర్చీ కోసం జరిగిన కుమ్ములాటపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. వారిద్దరికీ స్వయంగా ఫోన్లు చేసి మందలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన నాయకులు.. ఇలా చిల్లర విషయాలపై కొట్లాడి ప్రజల వద్ద చులకన కావొద్దని హెచ్చరించినట్లు తెలిసింది.

First Published:  1 Oct 2023 4:36 AM GMT
Next Story