Telugu Global
Telangana

బీజేపీ నాయకులకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోకుండా చూడాలి -కేసీఆర్

బీజేపీ నాయకులు నాకు అడ్డుపడటం కాదు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు మోదీ అడ్డుపడకుండా చూడాలి అని తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ అన్నారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా జ‌రిగిన సభలో ఆయన మాట్లాడారు.

బీజేపీ నాయకులకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోకుండా చూడాలి -కేసీఆర్
X

బీజేపీని నమ్మితే శఠగోపం పెడుతుందని, వాళ్ళ మాటలు నమ్మితే జీవితాలు నాశ‌నమైపోతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వికారాబాద్ లో కలక్టరేట్ భవనం ప్రారంభించిన కేసీఆర్ అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. తాను వస్తున్నప్పుడు అడ్డంగా ఒకరు బీజేపీ జెండా పట్టుకొని వచ్చారని అటువంటి వాళ్ళ మాటలు నమ్మితే మీరు మోసపోవడం ఖాయమన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తూ ఉంటే బీజేపీ వద్దంటోందని, మీటర్లు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.

రాష్ట్రంలో మళ్ళీ టీఆరెస్ ను గెలిపించుకోవడమే కాదు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించకపోతే మన జీవితాలు ఆగమవుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని పైగా రాష్ట్రాల హక్కుల కొల్లగొడుతున్నాడని, ప్రజలకోసం తాము నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను కూడా అడ్డుకుంటున్నార‌ని ఆరోపించారాయన.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకు కూడా కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని, కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలోని పథకాలను అమలు చేయాలని అక్కడి ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ అన్నారు.

త్వరలోనే పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టు ద్వారా వికారా బాద్ ప్రజలకు కృష్ణా జలాలు అందిస్తామని చెప్పిన కేసీఆర్. ఆ ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. స్థానిక నాయకులకు దమ్ముంటే మోదీ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టుకు అడ్డుపడకుండా చూడాలని కేసీఆర్ సవాల్ విసిరారు.


First Published:  16 Aug 2022 12:26 PM GMT
Next Story