Telugu Global
Telangana

బీజేపీలో టీచర్ ఎమ్మెల్సీ చిచ్చు.... డబ్బున్నవాళ్ళకే టిక్కట్లు ఇస్తారా అంటూ ప్రశ్నలు

బీజేపీలో టీచర్ ఎమ్మెల్సీ చిచ్చు.... డబ్బున్నవాళ్ళకే టిక్కట్లు ఇస్తారా అంటూ ప్రశ్నలు
X


వచ్చే ఏడాది మార్చ్ లో జరగనున్న ఉమ్మడి హైదరాబాద్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ అభర్థులను సిద్దం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో కాటేపల్లి జనార్ధన్ రెడ్డి గెలవగా మళ్ళీ ఆయన తన సత్తా చూపించుకోవాలని ఉబలాట పడుతున్నారు.

ఈ ఎన్నికల్లో గెలవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను నమోదు చేయడం, సరైన అభ్యర్థి కోసం గాలించడం లాంటి పనులు సాగిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఎలా గైనా గెలవాలని కంకణం కట్టుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు కొంత ముందు జరగనున్న‌ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నది. అందుకోసం సరైన అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నది. ఇప్పటికే బీజేపీ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని, ఆర్థికంగా మంచిపొజీషన్ లో ఉన్న, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టగలిగిన ఓ కార్పోరేట్ విద్యా సంస్థ యజమానిని రంగంలోకి దించాలని ఆ పార్టీ నిర్ణయించుకుందని బిజెపి వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

Advertisement

అయితే అభ్యర్థి ఎంపిక పట్ల ఆ పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఎంతో కాలంగా బీజేపీ లో, ఆరెసెస్ లో, ఏబీవీపీలో , టీపీయూఎస్ లాంటి సంఘాల్లో పని చేసి ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలు ఉండగా ఒక కార్పోరేట్ వ్యక్తికి టిక్కట్ ఇవ్వడం ఏంటని పలువురు సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అనేక సంవత్సరాలు ఏబీవీపీ లో పూర్తి కాలం కార్యకర్తగా పని చేసి, కొన్ని రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉండి, పోయిన ఎన్నికల్లో బీజేపీ తరపున ఎల్ బీ నగర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పేరాల శేఖర్ రావు, ఈ విషయంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు.

Advertisement

''అదేంది? ABVP-ABRSM-TPUS-BJP-OUTA లాంటి సంస్థలను, వేలాది కార్యకర్తల శ్రమతో-యాభై ఏళ్ల నుండి ఇంతగా పెంచి అభివృద్ధి చేశాo. దీనికోసం ఎంతో మంది సమయo ఇచ్చారు-త్యాగాలు చేశారు. అయినా, టీచర్ MLC కోసం ఒక్క టీచర్ అభ్యర్థి దొరకలేదా? ఇప్పుడు టీచర్ MLC కోసం ఒక కార్పోరేటు మ్యాన్ ను తెస్తారటగా? టీచర్ల జుట్టు యాజమానుల చేతిలో పెడతారా? డబ్బే ప్రధానమా? మరి మనం మాట్లాడే విలువలు, సిద్ధాంతము, క్రమ‌శిక్షణ, కార్యపధ్దతి లకు విలువ లేదా? ఇప్పటికే వివిధ సంస్థల నుండి డిక్లేర్ అయిన సుమారు 6-7 అభ్యర్థులు కూడా టీచర్లే...మన Teacher MLC ( సమైక్య పాలమూరు- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాలు) అభ్యర్థి కూడా టీచర్ మాత్రమే ఉండాలి.. నేను కరెక్టేనా?''అని శేఖర్ రావు తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఈయన చేసిన పోస్ట్ పై అనేక మంది బీజేపీ అభిమానులు స్పందిస్తున్నారు. మీరు చెప్పింది నిజమే ఇప్పుడు పార్టీలో డబ్బున్నోళ్ళదే రాజ్యమై పోయిందని ఒకరు కామెంట్ చేయగా ''ప్రతి కార్యకర్త ఆలోచించే విషయం ఏమిటంటే మన సంస్థలు బాగుండాలి,మన ధర్మం బాగుండాలి,మన దేశం బాగుండాలి అనే సంకల్పంతో నిస్వార్ధంగా పనిచేస్తున్నారు...

కానీ ఈరోజు మన సంస్థలలో పనిచేయని వారు,మన సిద్ధాంతాన్ని ఆచరించని వారు జాతీయ భావాలు లేని వారు కూడా ఈరోజు ఇందులో చేరి అధికారంతో అందలం ఎక్కితే రేపటి భవిష్యత్ పరిస్థితి ఏమిటో మీరే ఆలోచించండి?

అధికారమే పరమావధి అని ఆలోచిస్తే అధికారంలోకి వచ్చాక అది ఎవరి చేతిలో ఉంటుంది అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.'' అని మరో బీజేపీ అభిమాని కామెంట్ చేశారు.

మొత్తానికి సమైక్య పాలమూరు- రంగారెడ్డి- హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ పార్టీలో చిచ్చు రేపుతున్నాయన్నది నిజం. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడయ్యాక డబ్బులున్న వాళ్ళకు, కార్పోరేట్ కంపెనీల యజమానులకే ప్రాధాన్యత లభిస్తున్నదనే విమర్షలు కూడా ఆ పార్టీలో వినిపిస్తున్నాయి.

Next Story