Telugu Global
Telangana

ఆ పోస్ట్ లు వద్దు బాబోయ్.. పారిపోతున్న బీజేపీ నేతలు

ఇన్ చార్జ్ లకు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి, వారు నియోజకవర్గాలపై దృష్టి పెట్టడంలేదు. పార్టీ టికెట్ ఆశిస్తున్నవారికి కనీసం ఇన్ చార్జ్ పోస్ట్ కూడా లేదు కాబట్టి, వారి మాట ఎక్కడా చెల్లుబాటు కాదు. దీంతో తెలంగాణలో బీజేపీ ఇరకాటంలో పడింది.

ఆ పోస్ట్ లు వద్దు బాబోయ్.. పారిపోతున్న బీజేపీ నేతలు
X

ఏపీలో నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి అంటే దాదాపుగా ఎమ్మెల్యే పోస్ట్ తో సమానం. ఒక్కోచోట వారిని కాదని వేరేవారికి ఇన్ చార్జి పదవి ఇస్తే అక్కడ గొడవలైపోతున్నాయి. కానీ, తెలంగాణలో అందులోనూ బీజేపీలో నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, కన్వీనర్ల పదవులంటేనే నాయకులు హడలిపోతున్నారు. ఎందుకంటే ఆ పోస్ట్ వస్తే, వచ్చే ఎన్నికల్లో సీటు ఉండదు అని హైకమాండ్ తేల్చి చెబుతోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులు కట్టేసి, ఇన్ చార్జ్ పోస్ట్ లతో సరిపెట్టుకోమంటే ఊరుకునేది లేదంటున్నారు నేతలు. తమని ఆ పోస్ట్ ల నుంచి తప్పించండి అని వేడుకుంటున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, కన్వీనర్లుగా ఉన్నవారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని, వారు నియోజకవర్గంలో పార్టీ గెలుపు బాధ్యత తీసుకోవాలని ఇటీవలే స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్. గత నెల నియోజకవర్గ ఇన్ చార్జ్ ల సమావేశంలో ఆయన ఈ బాంబ్ పేల్చారు. దీంతో ఇన్ చార్జ్ లుగా ఉన్న చాలామంది అధిష్టానానికి తమ అసంతృప్తి తెలియజేశారు. తమని వెంటనే ఆ పదవులనుంచి తొలగించాలని, తాము తమ సొంత నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసుకుంటామని, అక్కడికే వెళ్లి ప్రజలతో మమేకమవుతామని చెప్పారు. అయితే ఆ తర్వాత బండి సంజయ్ వారికి కాస్త సర్దిచెప్పారు. 6నెలలు ఇన్ చార్జ్ లు గా ఉండాలని, ఆ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయని కవర్ చేశారు. కానీ ఇన్ చార్జ్ లు మాత్రం లోలోపల రగిలిపోతున్నారు.

ఇక జిల్లా పార్టీ అధ్యక్షుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ల నియామకంలో తమ మాట చెల్లుబాటు కావడంలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి కన్వీనర్ల నియామకంపై అలిగారు, పార్టీ శిక్షణ తరగతులకు కూడా ఆయన డుమ్మాకొట్టారు.

పార్టీ పరిస్థితి ఏంటి..?

ఇన్ చార్జ్ లకు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి, వారు నియోజకవర్గాలపై దృష్టి పెట్టడంలేదు. పార్టీ టికెట్ ఆశిస్తున్నవారికి కనీసం ఇన్ చార్జ్ పోస్ట్ కూడా లేదు కాబట్టి, వారి మాట ఎక్కడా చెల్లుబాటు కాదు. దీంతో తెలంగాణలో బీజేపీ ఇరకాటంలో పడింది. కానీ సునీల్ బన్సల్ మాత్రం ఈ కొత్త ప్రయోగంతో పార్టీని గెలిపిస్తానంటున్నారు. ఇన్ చార్జ్ లకు టికెట్లు ఇవ్వనంటున్న బీజేపీ ప్రయోగం తెలంగాణలో పూర్తిగా వికటిస్తుందని స్పష్టమవుతోంది. దీనికి తగ్గట్టుగానే ఇన్ చార్జ్ ల్లో అలక మొదలైంది.

First Published:  23 Nov 2022 2:44 PM GMT
Next Story