Telugu Global
Telangana

పోరాటం అంటే ఇలా అర్థమైందా..? కుమ్ముకున్న కాషాయదండు..

జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పార్టీ విధానాన్ని ప్రశ్నించినందుకు తోటి కార్యకర్తపైనే మరో బీజేపీ నాయకుడు దాడి చేశారు.

పోరాటం అంటే ఇలా అర్థమైందా..? కుమ్ముకున్న కాషాయదండు..
X

పోరాటం ఆపేది లేదు, నిరంతరం పోరాడుతూనే ఉంటామ‌ని బీజేపీ నేతలు ఇన్నాళ్లూ సవాళ్లు విసురుతుంటే.. టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తారేమో అనుకున్నారంతా. కానీ తమలో తామే కుమ్ములాడుకుంటారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ కాషాయదళంలో అంతర్గత కలహాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. తాజాగా జగిత్యాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పార్టీ విధానాన్ని ప్రశ్నించినందుకు తోటి కార్యకర్తపైనే మరో బీజేపీ నాయకుడు దాడి చేశారు. విచిత్రం ఏంటంటే.. ఈరోజు కోరుట్లలో తరుణ్ చుగ్ బహిరంగ సభ ఉంది. ఈ సభలో భారీగా చేరికలుంటాయని బీజేపీ జోరుగా ప్రచారం చేసింది కూడా.

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఇటీవలే బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సెలవిచ్చారు. ఆయన సభ సమయంలోనే ఇలా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. బీజేపీ నేతలు ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం తమ పార్టీలో ఏ స్థాయిలో ఉందో బహిరంగపరిచారు.

చేరికలతో బలం పెరుగుతుందా..?

చేరికలతో బీజేపీకి బలం పెరుగుతుందో లేదో కానీ.. అసంతృప్తి మాత్రం భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చే నాయకులతో పాత కాపులకు అస్సలు పొసగడం లేదు. తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని వారు భావిస్తున్నారు. పైగా కొత్తగా వచ్చేవారిలో నేర చరితులున్నారంటూ రచ్చ చేస్తున్నారు. ఈ దశలో కండువాల పండగ అనుకున్న స్థాయిలో సక్సెస్ అయ్యేలా కనిపించడంలేదు. కానీ తెలంగాణలో క్యాడర్ పెంచుకోవాలంటే బీజేపీకి చేరికలు తప్పనిసరి. అందుకే మునుగోడు అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చేరికలకు ముందే మరింతమంది నాయకుల్ని సమీకరించాలని అధిష్టానం భావిస్తోంది. కానీ ఈలోగా కాషాయదండు ఇలా పరస్పర దాడులతో రోడ్డునపడుతోంది.

First Published:  18 Aug 2022 11:44 AM GMT
Next Story