Telugu Global
Telangana

బీజేపీపై రాములమ్మ తిరుగుబాటు

గ‌త‌ కొద్ది రోజులుగా బీజేపీ తీసుకుంటున్న పలు నిర్ణయాలను విజయశాంతి బహిరంగంగానే తప్పుబ‌డుతున్నారు. ఇది కమలం పార్టీ నేతలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.

బీజేపీపై రాములమ్మ తిరుగుబాటు
X

బీజేపీలో ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ట్వీట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన మణిపూర్‌ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు విజయశాంతి. మణిపూర్‌ ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేరాలు ఏ రాష్ట్రంలో జరిగినా తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉండటంతో.. సొంత పార్టీనే విమర్శించేలా విజయశాంతి ట్వీట్స్‌ ఉన్నాయని చర్చ జరుగుతోంది.


గ‌త‌ కొద్ది రోజులుగా బీజేపీ తీసుకుంటున్న పలు నిర్ణయాలను విజయశాంతి బహిరంగంగానే తప్పుబ‌డుతున్నారు. ఇది కమలం పార్టీ నేతలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. స్వపక్షంలోనే విపక్షంలా రాములమ్మ తయారయ్యారని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర చీఫ్‌గా కిషన్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న రోజు కూడా కార్యక్రమం మధ్యలోనుంచే వెళ్లిపోయారు విజయశాంతి. అయితే తర్వాత ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇక బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని కూడా విజయశాంతి వ్యతిరేకించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ధర్నాల్లోనూ ఆమె ఎక్కడా పాల్గొనలేదు.

పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం సహా తన తర్వాత పార్టీలో చేరిన వారికి పదవులు రావడంతో రాములమ్మ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విజయశాంతి తర్వాత పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన అధిష్టానం.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. వీటితో పాటు కొత్తగా వేస్తున్న కమిటీల్లోనూ తనకు స్థానం కల్పించకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమె పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి బీజేపీని వీడుతారని సోషల్‌మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

2014లో కేసీఆర్‌తో విబేధాల కారణంగా అప్పటి టీఆర్ఎస్‌ను వీడిన విజయశాంతి..తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2020 నవంబర్‌లో హస్తం పార్టీని వీడి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఉన్నారు.

First Published:  25 July 2023 12:36 PM GMT
Next Story