Telugu Global
Telangana

పార్టీ మార్పు ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చిన‌ జితేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని మొదటి నుంచి నమ్మకంగా ఉన్నానని.. అయితే టికెట్ రాకపోవడం తనను బాధిస్తోందని చెప్పారు.

పార్టీ మార్పు ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చిన‌ జితేందర్ రెడ్డి
X

తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారని.. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాతో జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డితో జరిగిన భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ మాత్రమేనని అన్నారు.

మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని మొదటి నుంచి నమ్మకంగా ఉన్నానని.. అయితే టికెట్ రాకపోవడం తనను బాధిస్తోందని చెప్పారు. తన భవిష్యత్తు ఏంటో బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడం కొత్తేమీ కాదని.. గతంలో కూడా పలుమార్లు వచ్చారని జితేందర్ రెడ్డి చెప్పారు.

తనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో పరామర్శించేందుకే ఆయన తన ఇంటికి వచ్చారని తెలిపారు. అంతే తప్ప వేరే చర్చలు జరగలేదన్నారు. తనకు ఎంపీ టికెట్ రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి బాధపడ్డారని జితేందర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ తరపున మల్కాజ్‌గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి కోరారా? అని మీడియా ప్రశ్నించగా, అటువంటి చర్చ ఏమి తమ మధ్య జరగలేదని జితేందర్ రెడ్డి తెలిపారు.

First Published:  14 March 2024 1:29 PM GMT
Next Story