Telugu Global
Telangana

బిడ్డా రేవంత్‌.. ముందుంది ముసళ్ల పండగ - ఈటల రాజేందర్

మల్కాజ్‌గిరికి, ఈటలకు సంబంధం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని.. తాను ఓ కులానికో, ఓ ప్రాంతానికో, ఓ మతానికో సంబంధించిన బిడ్డను కాదన్నారు ఈటల.

బిడ్డా రేవంత్‌.. ముందుంది ముసళ్ల పండగ - ఈటల రాజేందర్
X

ఆదివారం మేడ్చల్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ తననుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈటల రాజేందర్‌ ఏ ముఖం పెట్టుకుని మల్కాజ్‌గిరి ప్రజలను ఓట్లు అడుగుతాడంటూ రేవంత్ ఆ సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కౌంటర్ ఇచ్చారు ఈటల.

మల్కాజ్‌గిరికి, ఈటలకు సంబంధం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని.. తాను ఓ కులానికో, ఓ ప్రాంతానికో, ఓ మతానికో సంబంధించిన బిడ్డను కాదన్నారు ఈటల. 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టిబిడ్డగా, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానన్నారు. కొంతమంది చప్పట్లు కొట్టగానే ఎవరిమీద పడితే వారి మీద, స్థాయి మరిచి రెచ్చిపోయి మట్లాడేవారు కొందరు ఉంటారని.. అలాంటి వాళ్లకు ముందుంది ముసళ్ల పండగ అన్నారు ఈటల.

ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడు శూన్యం నుంచి బడ్జెట్ రూపొందించుకున్నామన్నారు ఈటల. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముందో, మున్ముందు ఏం కాగలదో చెప్పగలిగే శక్తి తనకు ఉందన్నారు. కానీ, ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే విమర్శ చేయకూడదన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడటం లేదన్నారు ఈటల. తన రాజకీయ జీవితంలో ఏ నాయకుడి మీదగానీ, ఏ పార్టీ మీద గానీ వ్యక్తిగతమైన దూషణలు చేయలేదన్నారు. తనకు ఆ సంస్కారం ఉందన్నారు.

First Published:  10 March 2024 6:30 PM GMT
Next Story