Telugu Global
Telangana

పాదయాత్రల పర్వానికి బీజేపీ శ్రీకారం

బండి సంజయ్‌ని త‌క్కువగా అంచ‌నా వేసి ఆయ‌న్ను ప‌క్కకు త‌ప్పించార‌ని అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్త పరచడానికి బండి పాదయాత్ర దోహదపడుతుందని అధిష్టానం భావిస్తోంది.

పాదయాత్రల పర్వానికి బీజేపీ శ్రీకారం
X

బండి సంజయ్‌ని తెలంగాణ అధ్యక్ష బాధ్యతల్నించి తప్పించినా, పార్టీని బలోపేతం చేయాలంటే ఆయనే గత్యంతరం అని అధిష్టానం భావిస్తోందట. అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న జిల్లాల గెలుపు బాధ్యత‌ను బండికి క‌ట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా పార్టీకి ఊపు తెచ్చిన బండి సంజ‌య్‌ని తప్పించడంతో ఆయన వర్గం అసంతృప్తి రగిలిపోతోంది. ఇప్పుడు క్యాడర్‌లో జోష్‌ నింపేందుకు ఆయనకే కీలక జిల్లాల బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోందట.

నూతన నాయకత్వం వచ్చినా, బండి సంజ‌య్‌ని కాద‌ని ఇప్పటికిప్పుడు బీజేపీ చేయ‌గ‌లిగేదేమి లేదు. అందుకే బీజేపీ నామ‌మాత్రంగా ఉన్న జిల్లాల్లో పార్టీని బ‌లోపేతం చేసే బాధ్యతను బండికి అప్పజెప్పింది కేంద్ర బీజేపి నాయ‌క‌త్వం. పార్టీని బలోపేతం చేసేందుకు ఆగ‌స్ట్ నుంచి తెలంగాణ‌లో జిల్లాల పాదయాత్రకు రెడీ అవుతోంది బీజేపీ. గ‌తంలో పార్టీ అధ్యక్ష హోదాలో బండి సంజయ్‌ ఒక్కరే పాదయాత్ర చేశారు. కానీ, ఈ ద‌ఫా అధ్యక్షుడు, ఎన్నిక‌ల నిర్వహ‌ణ క‌మిటీ చైర్మన్‌తో పాటు బండి సంజ‌య్‌ విడివిడిగా పాద‌యాత్రలు చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసింది బీజేపీ.

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి‌ సంజయ్ భద్రాచలం సీతారామ స్వామి దేవాలయం నుండి పాదయాత్ర ప్రారంభించి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తారు. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొమురం భీమ్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం టొంకిని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి పాదయాత్ర ప్రారంభించి, ఆదిలాబాద్ , నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల‌ను చుట్టేస్తారు. ఇక కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుండి ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించి కరీంనగర్, మెదక్, వరంగల్లు జిల్లాల్లో ప‌ర్యటిస్తారు. ఇలా వివిధ జిల్లాల్లో ఈ ముగ్గురు నాయ‌కులు పాద‌య‌త్ర చేసి పార్టీని అధికారానికి చేరువచేయాలనే ప్లాన్‌ను పార్టీ సిద్ధం చేసింది.

బండి సంజయ్‌ని త‌క్కువగా అంచ‌నా వేసి ఆయ‌న్ను ప‌క్కకు త‌ప్పించార‌ని అసంతృప్తితో ఉన్న నేతలను సంతృప్త పరచడానికి బండి పాదయాత్ర దోహదపడుతుందని అధిష్టానం భావిస్తోంది. పాదయాత్రల్లో బండికి ప్రాధాన్యతనివ్వడంతో బండి లేనిదే పార్టీ లేదనే చర్చ తెలంగాణ బీజేపీలో మొదలైంది.

First Published:  11 July 2023 5:08 AM GMT
Next Story