Telugu Global
Telangana

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది : వినోద్ కుమార్

కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యావిధానం రుద్దే ప్రయత్నం చేస్తోందని.. దేశంలో ఏక పార్టీ పాలన జరుగుతోందని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది : వినోద్ కుమార్
X

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రాలపై పెత్తనం సాగించేందుకు వీలుగా కేంద్రం వ్యూహాలు సిద్ధం చేస్తోందని ఆయన అన్నారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్‌లో వీసీ రమేశ్ ఆధ్వర్యంలో 'ఛేంజింగ్ సినారియో ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం' అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చన వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలో నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే యూపీ ముఖ్యమంత్రిని గద్దె దించారని గుర్తు చేశారు. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష పార్టీని కూడా కూలదోశారని చెప్పారు.

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీ, బీహార్, కేరళ, తమిళనాడుపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించిందని.. అదే సమయంలో రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాష్ట్రాల హక్కులను కబలించారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ విద్యావిధానం రుద్దే ప్రయత్నం చేస్తోందని.. దేశంలో ఏక పార్టీ పాలన జరుగుతోందని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2019లో ప్రధాని నరేంద్ర మోడీ రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే తమిళనాడులో బోర్డులపై, రైళ్లపై ఇంగ్లీష్, హిందీని రాసే ప్రయత్నం చేయగా అక్కడ తీవ్ర పరిణామాలను ఎదుర్కున్న విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడులో ఎదురైన తీవ్ర పరిణామాలకు తలవంచక తప్పలేదని.. ప్రజల ఒత్తిడి మేరకు మాతృ భాషలోనే బోర్డులు ఉంచాల్సి వచ్చిందని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ఎంబీబీఎస్ కూడా హిందీలోనే ఉంటుందని చెప్పడం సరైనది కాదని వినోద్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1062 అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తూ శాసన సభ బిల్లు పాస్ చేసినా.. రాష్ట్ర గవర్నర్ ఇంత వరకు దానిపై సంతకం చేయలేదని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఇలాంటి విషయాల వల్ల గవర్నర్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయక తప్పలేదని వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పని చేయకుండా కేంద్రమే కట్టడి చేస్తోందని వినోద్ దుయ్యబట్టారు. కేంద్రం చెప్పింది వినకపోతే కనీసం అప్పు కూడా పుట్టడం లేదని ఆయన అన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్.. ఇలా ప్రతీ వస్తువుపై జీఎస్టీ ద్వారా కేంద్రానికి భారీగా పన్నులు చెల్లిస్తున్నామని వినోద్ అన్నారు. గోదావరి, కృష్ణ నదులపై ప్రాజెక్టుల కోసం, పవర్ ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తున్నాము. అప్పు తీసుకొని వచ్చి సంక్షేమ పథకాల కోసం వాడటం లేదని.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దుబారా ఖర్చులు చేయడం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

First Published:  17 March 2023 2:40 PM GMT
Next Story