Telugu Global
Telangana

టీఆరెస్ పై ప్లాన్ బెడిసికొట్టడంతో ఇక కాంగ్రెస్ నాయకులకు ఎర వేస్తున్న‌ బీజెపి

బీజెపిలో టీఆరెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఇక సాధ్యంకాదని తేల్చుకున్న ఆ పార్టీ నాయకులు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం.

టీఆరెస్ పై ప్లాన్ బెడిసికొట్టడంతో ఇక కాంగ్రెస్ నాయకులకు ఎర వేస్తున్న‌ బీజెపి
X

న‌వ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది భార‌తీయ జ‌న‌తా పార్టీ(బిజెపి). తెలంగాణ లో ఇప్ప‌టికే టీఆరెస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్య‌హారంలో భంగ‌ప‌డినా బిజెపి త‌న ప్ర‌య‌త్నాల‌ను మానుకోవ‌డంలేదు. టీఆరెస్ నాయకులతో పని అయ్యేట్టు లేదని ఇక కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయింది. ఇదే సంద‌ర్భంలో ఆ పార్టీ నాయ‌కుల‌ను చేర్చుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను బిజెపి మ‌రింత ముమ్మ‌రం చేసింది.

మునుగోడు ఉప ఎన్నిక‌లో డిపాజిట్ కూడా కోల్పోయి మూలుగుత‌న్న కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. కాంగ్రెస్ నుంచి మళ్లీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తోంది బీజేపీ. ఇప్పటికే అనేక మందిని పార్టీ మార్పించి.. కాంగ్రెస్ ను దెబ్బతీస్తున్న బీజేపీ తాజాగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పవర్ రామారావు కు ఎర వేసినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్తవానికి మునుగోడు ఎన్నికలకు ముందుగానే రామారావు పార్టీ మారతారని ప్రచారం జ‌రిగినా అప్పట్లో ఆయ‌న ఎవ‌రికీ అందుబాటులో లేకుండా పోయారు. మునుగోడు ఎన్నిక త‌ర్వాత క్ర‌మంగా రామారావు పార్టీ మార్పుపై ఆయ‌న వ‌ర్గం నుంచి లీకులు రావ‌డంతో ఆయ‌న పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

బిజెపి నుంచి ఆహ్వానం అందింద‌ని చెబుతూ ఆయ‌న భైంసాలో కాంగ్రెస్ పార్టీ లోని త‌న అనుచ‌రుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వారి అభిప్రాయాల‌ను తెలుసుకుంటున్నారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న బిజెపి, హిందూ సంఘాల‌తో సైతం స‌మావేశాలు జ‌రుపుతున్నారు. ప్ర‌జ‌ల అభిప్రాయం మేర‌కే న‌డుచుకుంటాన‌ని చెబుతున్న‌ప్ప‌టికీ ఈ నెలాఖ‌రు లోపు బిజెపిలో చేరేందుకు ముహ‌ర్తం ఖ‌రారైంద‌ని తెలుస్తోంది. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన రామారావు ఆ ర్వాత జిల్లా అధ్య‌క్షుడ‌య్యారు. ఆయ‌న పార్టీ మారితే జిల్లాలో కాంగ్రెస్ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. కాగా, మునుగోడు ఫ‌లితంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మ‌రిన్ని వ‌ల‌స‌లు ఉండే అవ‌కాశం ఉంద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.

First Published:  14 Nov 2022 12:22 PM GMT
Next Story