Telugu Global
Telangana

కేసీఆర్ ఢిల్లీని శాసిస్తారనే అనుమానం.. అందుకే కుట్రకు పన్నాగం

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలకడమే కాదు, విపక్షాల్లో ఓ ఊపు తెచ్చారు కేసీఆర్. దీంతో కేంద్రం బిత్తరపోయింది. కేసీఆర్ ని, తెలంగాణను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ముప్పు తప్పదని భావించింది. ఆ భయంలోనుంచే కుట్ర మొదలైంది.

కేసీఆర్ ఢిల్లీని శాసిస్తారనే అనుమానం.. అందుకే కుట్రకు పన్నాగం
X

2014 కంటే 2019లో బీజేపీ పరిస్థితి బాగా మెరుగైంది. దాన్ని కాపాడుకుంటే చాలు, కొత్తగా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి స్థానిక ప్రభుత్వాలను అణగదొక్కాల్సిన పనిలేదు. కానీ ఉత్తరాదిలో తమ పట్టు నిలుపుకోడానికి, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తమ ఉనికి చాటుకోడానికి బీజేపీ కుటిల పన్నాగాలు పన్నుతోంది. మరి తెలంగాణతో ఏమొచ్చింది. తెలంగాణలో బీజేపీకి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీన్ లేదు. భవిష్యత్తులో ఏర్పాటు చేస్తుందన్న ఆశ కూడా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది. తెలంగాణలో ఎమ్మెల్యేల కోసం ఎందుకు రాయబారాలు సాగించారు..?

కేసీఆర్ అంటే భయం..

కేసీఆర్ భయం వల్లే మోదీలో వణుకు పుట్టింది. ఆ భయం వల్లే తెలంగాణపై కుట్రకు తెరలేచింది. ఆ కుట్రలో భాగంగానే ఉప ఎన్నికలు, ఎమ్మెల్యేలతో బేరసారాలు, ఈడీ, ఐటీ దాడులు. వీటన్నిటికీ కారణం ఒక్కటే. కేసీఆర్ అంటే మోదీలో రోజు రోజుకూ పెరుగుతున్న భయం.

ఎందుకీ భయం..?

తనకు అడ్డొచ్చే అవకాశముందని తన గురువు అద్వానీనే క్రమంగా పక్కకు తప్పించేసిన చరిత్ర నరేంద్రమోదీది. దక్షిణాదినుంచి బలమైన గొంతుగా ఉన్న వెంకయ్య నాయుడిని రాజ్యాంగ పదవి పేరుతో చేతులు కట్టేసిన చతురత కూడా ఆయనదే. అలాంటి మోదీ, కేసీఆర్ లో భవిష్యత్ నాయకుడిని చూశారు. ఆరు నెలల క్రితమే దీనికి బీజం పడింది. జాతీయ పార్టీకి కేసీఆర్ చేసిన సన్నాహాలతోనే బీజేపీలో భయం మొదలైంది. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏమీ ఒరగలేదని గణాంకాల సాక్షిగా చూపించిన కేసీఆర్‌, వివిధ రంగాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను దేశ ప్రజల ముందుంచారు. దేశం తప్పుడు మార్గంలో వెళుతున్నదని, ఇప్పటికైనా దిద్దుబాటు జరగాలని డిమాండ్‌ చేశారు.

దానికి కొనసాగింపుగా పంజాబ్ వెళ్లి రైతు ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత బీహార్ వెళ్లారు. చైనాతో జరిగిన ఘర్షణలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం చేశారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలకడమే కాదు, విపక్షాల్లో ఓ ఊపు తెచ్చారు కేసీఆర్. దీంతో కేంద్రం బిత్తరపోయింది. కేసీఆర్ ని, తెలంగాణను ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ముప్పు తప్పదని భావించింది. ఆ భయంలోనుంచే కుట్ర మొదలైంది.

కేసీఆర్ ని తెలంగాణలోనే నిలువరించాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. దానికి తగ్గట్టుగానే 2023 ఎన్నికలకు ముందు తెలంగాణలో ఓ ఉప ఎన్నిక తేవాలనుకున్నారు. అనుకోకుండా రాజగోపాల్ రెడ్డి ఆటలో పావుగా మారారు. ఉప ఎన్నిక ముందే ఎమ్మెల్యేల ఫిరాయింపుతో టీఆర్ఎస్ ని భయపెట్టాలనుకున్నారు. ఊహించని విధంగా బ్రోకర్లతో సహా అందరూ అడ్డంగా బుక్కయ్యారు. ఆ ఎపిసోడ్ ని డైవర్ట్ చేయడానికి, మునుగోడు ఉప ఎన్నిక పరాభవాన్ని తప్పించుకోవ‌డానికి ఇప్పుడు ఐటీ, ఈడీ దాడులంటూ టీఆర్ఎస్ నేతల్ని బెదిరిస్తున్నారు. తెలంగాణలో ముందు ముందు మరిన్ని దాడులు జరుగుతాయని చాన్నాళ్ల క్రితమే కేసీఆర్ హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈడీ, ఐటీ దూకుడు పెంచాయి. తెలంగాణలో ఏదో జరుగుతోందన్న భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

2023లో గట్టి సమాధానం..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి సమాధానం చెప్పబోతున్నారు కేసీఆర్. ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆయన దృష్టిపెడతారు. ఢిల్లీ మోదీ అబ్బ సొత్తు కాదు, కేంద్రంలో అధికారం బీజేపీకి శాశ్వతం కాదు. ఐదేళ్లలో మార్పు తేలేకపోయినా మరో ఐదేళ్లు ప్రజలు అధికారమిచ్చారు. దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈసారి బీజేపీకి గట్టిషాక్ తగలబోతోంది. అందుకే విపక్షాల బలాన్ని, ఐక్యతను దెబ్బతీయాలనుకుంటున్నారు మోదీ. అందుకే ఈ కుట్రలు, కుతంత్రాలు. కానీ కర్నాటక, మహారాష్ట్ర, గోవాలో పారిన పాచికలు తెలంగాణలో రివర్స్ అయ్యాయి. బీజేపీకి ముందు ముందు మరింత కష్టకాలం ఉంది.

First Published:  14 Nov 2022 4:48 AM GMT
Next Story