Telugu Global
Telangana

అయ్యప్ప స్వాములను ఘోరంగా అవమానించిన బీజేపీ..

అయ్యప్ప మాల ధరించిన పిల్లల్ని స్కూల్స్ లోకి రానివ్వకపోతే బీజేపీ నేతలు ఎంత రాద్ధాంతం చేస్తారో అందరికీ తెలుసు. అలాంటిది మాలధారణ చేసిన భక్తుల్ని బీజేపీ, తమ సభకు రానివ్వకపోవడం తప్పు కాదా..?

అయ్యప్ప స్వాములను ఘోరంగా అవమానించిన బీజేపీ..
X

హిందూ మత ఉద్ధారకుల్లాగా బిల్డప్ ఇస్తుంటారు బీజేపీ నేతలు. కానీ, హిందూ మతాన్ని, మత ఆచారాలను ఘోరంగా అవమానించేది కూడా వారే. ఇదేదో ఆరోపణ కాదు, పచ్చి నిజం. రామగుండంలో జరిగిన ప్రధాని మోదీ సభ సాక్షిగా బయటపడిన ఘోరం. మోదీ సభకు అయ్యప్ప స్వాములకు నో ఎంట్రీ అని చెప్పేశారు బీజేపీ నేతలు. సభకు వచ్చినవారిని కూడా వెనక్కు తిప్పి పంపించేశారు.

నలుపు దుస్తులంటే భయం..

తెలంగాణలో మోదీ పర్యటనకు ముందునుంచీ నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని మోదీ, ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారని, అప్పటికే నడుస్తున్న రామగుండం కర్మాగారాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించడమేంటనే విమర్శలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మోదీ గోబ్యాక్ అనే నిరసనలు మిన్నంటాయి. నల్లబెలూన్లతో కొంతమంది మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. దీంతో అయ్యప్ప స్వాముల్ని కూడా పక్కనపెట్టేశారు బీజేపీ నేతలు. అయ్యప్ప మాల వేసుకున్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు మోదీ సభ చూసేందుకు రాగా, వారిని సభా ప్రాంగణంలోకి అనుమతించలేదు. వారంతా మాలధరించిన భక్తులని తెలిసినా కూడా అవమానించారు. నల్లదుస్తులతో వారు సభలోకి వస్తే మోదీ ఎక్కడ ఫీలయిపోతారేమోననేది బీజేపీ నేతల భావన.

అంత భయం ఎందుకు..

మోదీ సభలో నల్లజెండాలు కనిపిస్తాయేమో, నల్ల బెలూన్లు ఎగురుతాయేమోనని భయపడ్డారు బీజేపీ నేతలు. అందుకే నల్ల చొక్కా వేసుకున్న అయ్యప్ప స్వాముల్ని ఘోరంగా అవమానించారు. అయ్యప్ప మాల ధరించిన పిల్లల్ని స్కూల్స్ లోకి రానివ్వకపోతే బీజేపీ నేతలు ఎంత రాద్ధాంతం చేస్తారో అందరికీ తెలుసు. అలాంటిది మాలధారణ చేసిన భక్తుల్ని బీజేపీ తమ సభకు రానివ్వకపోవడం తప్పు కాదా. ఇదే పని ఇంకో పార్టీ చేస్తే కాషాయదళం ఎంత రాద్ధాంతం చేస్తుంది. హిందూ మతానికి రక్షకులం, మత ఉద్ధారకులం అని చెప్పుకుంటున్న బీజేపీ అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు సోషల్ మీడియా వేదికగా వినపడుతున్నాయి. మరి వీటికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.

First Published:  14 Nov 2022 6:07 AM GMT
Next Story