Telugu Global
Telangana

కేసీఆర్ బీహార్ టూర్ పై బీజేపీ అధిష్టానం సైలెన్స్..

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ దశలో కేసీఆర్ ని కదిలించి మరీ తిట్టించుకోవడం కమలదళానికి ఇష్టంలేనట్టుంది. అందుకే సైలెంట్ గా ఉంది.

కేసీఆర్ బీహార్ టూర్ పై బీజేపీ అధిష్టానం సైలెన్స్..
X

కేసీఆర్ బీహార్ టూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీఎం నితీష్ కుమార్ భేటీ అనంతరం రాజకీయ దురంధరుడు, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. తన సహజ ధోరణికి తగ్గట్టుగానే బీజేపీపై విమర్శల దాడి చేశారు. కేంద్రంలో బీజేపీకి కచ్చితంగా ప్రత్యామ్నాయం ఉండాలన్నారు. దానికోసం ప్రాంతీయ పార్టీలన్నీ కలసి నడవాలని చెప్పారు. బీజేపీని దేశం నుంచి సాగనంపాలన్నారు, గుజరాత్ మోడల్ ఓ ఫెయిల్యూర్ మోడల్ అంటూ విమర్శించారు. బీజేపీ హయాంలో ధరలు విపరీతంగా పెరిగాయని, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశారని, డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రికార్డ్ స్థాయిలో పతనమైందని గుర్తు చేశారు.

డోస్ పెద్దదే, కానీ..

కేసీఆర్ ప్రసంగం అంటేనే మోదీకి పెద్ద డోస్ పడిపోతుంది. ఈసారి బీహార్ లో కూడా ఏమాత్రం తగ్గలేదు. అన్ని రకాలుగా మోదీ ఫెయిల్యూర్ అంటూ ఏకిపారేశారు కేసీఆర్. సహజంగా కేసీఆర్ ప్రసంగం తర్వాత వెంటనే బీజేపీ అధిష్టానం రియాక్ట్ అవుతుంది. కానీ ఈసారి మాత్రం కేంద్రంలోని పెద్దలెవరూ కేసీఆర్ ప్రసంగాన్ని ఖండించలేదు. కనీసం తమపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని కూడా చెప్పుకోలేని పరిస్థితి. నేరుగా గుజరాత్ మోడల్ ని కూడా కేసీఆర్ దుయ్యబట్టినా బీజేపీ అధిష్టానం సైలెంట్ గానే ఉంది. కేసీఆర్ ని రెచ్చగొడితే మరిన్ని విమర్శలు ఎదురవుతాయనే భయం బీజేపీ జాతీయ నాయకుల్లో ఉంది. ఇప్పటికే జాతీయ పార్టీ అంటూ బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు తెలంగాణ సీఎం. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ దశలో కేసీఆర్ ని కదిలించి మరీ తిట్టించుకోవడం కమలదళానికి ఇష్టంలేనట్టుంది. అందుకే సైలెంట్ గా ఉంది.

రాష్ట్ర నేతల విమర్శలు..

కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా తెలంగాణ బీజేపీ నేతలు ఎగిరెగిరి పడటం సహజమే. ఈసారి కూడా బండి సంజయ్ కేసీఆర్ పై రెచ్చిపోయారు. రాష్ట్రంలో సమస్యలు పెట్టుకుని ఆయన ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్లారంటూ మండిపడ్డారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కేసీఆర్ ని టార్గెట్ చేశారు. రాష్ట్ర నేతలు మాటల తూటాలు పేల్చాలనుకున్నారు కానీ, బీజేపీ అధిష్టానం మాత్రం కేసీఆర్ పర్యటనపై గుంభనంగా ఉంది. బీహార్ లో ఎన్డీఏ కూటమినుంచి బయటకొచ్చిన నితీష్ కుమార్ ఆర్జేడీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ విషయంలో ఇప్పటికే బీజేపీ రగిలిపోతూ ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో కేసీఆర్ బీహార్ వెళ్లడం, బీజేపీని టార్గెట్ చేయడంతో ఈ వేడి మరింత పెరిగింది. కానీ బీజేపీ మాత్రం బయటపడలేదు. జాతీయ నాయకులెవరూ కేసీఆర్ ప్రస్తావన తేలేదు, తమపై వచ్చిన విమర్శలను ఖండించే సాహసం చేయలేదు.

First Published:  1 Sep 2022 3:07 AM GMT
Next Story