Telugu Global
Telangana

మునుగోడు ఉపఎన్నికకు పక్కా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ

కులాల వారీగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యూహం సిద్ధం చేయాలని బీజేపీ భావిస్తోంది. దళిత బంధు, గిరిజన బంధు అని కేసీఆర్ పదే పదే వ్యాఖ్యానిస్తుండటంతో.. బీజేపీ కూడా కులాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఓట్లను తమకు పడేలా చూడాలని కార్యకర్తలను ఆదేశించింది

మునుగోడు ఉపఎన్నికకు పక్కా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ
X

మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. దీంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఉపఎన్నిక కచ్చితంగా త్రిముఖ పోరు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుగోడు నుంచి కేసీఆర్ జాతీయ పార్టీ బరిలోకి దిగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణలో అక్టోబర్ 24న అడుగు పెట్టనున్నారు. దీంతో ఈ నెలాఖరులో శంషాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇది మునుగోడు ఉపఎన్నికకు ఉపయోగపడేలా ప్లాన్ చేస్తోంది. ఇక ఈ ఉపఎన్నిక బీజేపీకి పెద్ద సవాలుతో కూడుకున్నది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి ఆయనే బీజేపీ తరపున బరిలో ఉండబోతున్నారు. ఇది వ్యక్తిగతంగా రాజగోపాల్ రాజకీయ భవిష్యత్‌కు, తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి కూడా కీలకమైన ఎన్నిక. దీంతో అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునిల్ బన్సల్ దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల అవుతుందని ముందే తెలియడంతో ఆ మేరకు పార్టీ నాయకులను కూడా అప్రమత్తం చేశారు. దసరా రోజు దాదాపు 1000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ కార్యకర్త 50 నుంచి 70 ఓట్లు వేయించే విధంగా వారిని సిద్ధం చేయాలని భావిస్తున్నారు.

బూత్ లెవెల్ మీటింగ్‌లో రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కూడా మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను బీజేపీకి మళ్లించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను కూడా క్షేత్రస్థాయిలో అందరికీ వివరించాలని ఆదేశించనున్నారు. ఇక కొత్తగా నియోజకవర్గంలో 23 వేల ఓట్లు నమోదయ్యాయి. వీటిపై ఫోకస్ చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. అక్టోబర్ 7న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులందరూ హాజరవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఉపఎన్నిక ఇంచార్జి జి. వివేక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దసరా తర్వాత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

కులాల వారీగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యూహం సిద్ధం చేయాలని బీజేపీ భావిస్తోంది. దళిత బంధు, గిరిజన బంధు అని కేసీఆర్ పదే పదే వ్యాఖ్యానిస్తుండటంతో.. బీజేపీ కూడా కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఓట్లను తమకు పడేలా చూడాలని కార్యకర్తలను ఆదేశించింది. పథకాలు అందని అసంతృప్తులను తమవైపు తిప్పుకుంటే తప్పకుండా లాభముంటుందని భావిస్తోంది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులను ఎలాగైనా పార్టీలోకి తీసుకొని రావాలని స్థానిక నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి.

First Published:  3 Oct 2022 9:08 AM GMT
Next Story