Telugu Global
Telangana

ఈటలకు భారీ టార్గెట్ ఇచ్చిన బీజేపీ.. అప్పుడే మొదలైన విమర్శలు.!

ప్రజా సంగ్రామ యాత్రలో ఎప్పటికప్పుడు కొత్త నాయకులను పార్టీలోకి తేవాలనే ఒత్తిడి ఈటలపై పెరిగింది. ఇప్పటికీ ఒక్కరిని కూడా చేర్పించలేదనే విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి.

ఈటలకు భారీ టార్గెట్ ఇచ్చిన బీజేపీ.. అప్పుడే మొదలైన విమర్శలు.!
X

తెలంగాణలో వచ్చే సార్వ‌త్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ఈ ఏడాది చివరి వరకు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆ సమావేశాలు ముగిసిన వెంటనే తెలంగాణను నాలుగు క్లస్టర్లుగా విభజించి, నాలుగురు కేంద్ర మంత్రులను బాధ్యులుగా చేశారు.

అదే సమయంలో సీనియర్ రాజకీయ నాయకుడు ఈటల రాజేందర్‌కు బీజేపీ కీలకమైన బాధ్యతలు అప్పగించింది. జాయినింగ్స్ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్‌లో చురుకుగా పనిచేసిన ఈటల.. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన కొందరిలో ఈటల కూడా ఒకరు. ఈటలకు టీఆర్ఎస్‌తో పాటు ఇతర పార్టీ నాయకులతో కూడా మంచి సఖ్యత ఉంది. ఆయన బీజేపీలోకి వెళ్లినా.. ఇంకా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఈటలకు పరిచయాలు ఉన్నాయి. అందుకే జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు ఈటలపై పెట్టారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 40 మంది కీలక నేతలను బీజేపీలో చేర్పించాలనే టార్గెట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈటలకు ఈ బాధ్యతలు అప్పగించి ఇప్పటికి మూడు వారాలు గడుస్తున్నా.. ఒక్కరు కూడా చేరలేదు. ప్రజా సంగ్రామ యాత్రలో ఎప్పటికప్పుడు కొత్త నాయకులను పార్టీలోకి తేవాలనే ఒత్తిడి ఈటలపై పెరిగింది. ఇప్పటికీ ఒక్కరిని కూడా చేర్పించలేదనే విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి.

కాగా, ఆషాడ మాసం కారణంగా పార్టీలోకి కొత్తగా ఎవరు చేరడం లేదని.. ముహూర్తాలు ప్రారంభం అయ్యాక వలసలు పెరుగుతాయని ఈటల కవర్ చేసుకుంటున్నారు. ఈ నెల 27 తర్వాత భారీ చేరికలు ఉంటాయని ఈటల హింట్ ఇస్తున్నారు. ఆ చేరికలు రెండు పార్టీల్లో కలకలం రేపుతాయని కూడా వ్యాఖ్యానించారు. అయితే బీజేపీలో చేరే ఆ నాయకులు ఎవరనేది మాత్రం తేలడం లేదు.

ఈటల జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రవీణ్ రెడ్డి విషయంలో విమర్శలు ఎదుర్కున్నారు. హుస్నాబాద్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బీజేపీలో చేరతారని ముందుగానే లీక్ చేశారు. అయితే అప్రమత్తం అయిన కాంగ్రెస్ వెంటనే ఆయనను తిరిగి పార్టీలోకి తెచ్చుకోవడంలో సఫలం అయ్యింది. దీనిపై అధిష్టానం ఈటలపై మండిపడినట్లు తెలుస్తుంది. కీలక నేతల చేరికలపై ముందుగానే లీకులు ఇవ్వొద్దని ఘాటుగానే హెచ్చరించినట్లు సమాచారం.

మరోవైపు ఈటల కచ్చితంగా టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తారని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే ఈటలకు కళ్లెం వేయాలని టీఆర్ఎస్ ఇప్పటికే వ్యూహ రచన చేసినట్లు సమాచారం. ఈటల-నయీం లింకులకు సంబంధించిన కేసును మరోసారి తెరపైకి తెచ్చి అతడిని ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా హుజూరాబాద్ విషయంలో జరిగిన అవమానాన్ని మర్చిపోవడం లేదు. అందుకే తమ పార్టీ నుంచి బీజేపీకి వలసలను కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ నాయకులతో చర్చలు జరుపుతోంది. రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ బుజ్జగింపులకు ప్రధానంగా వ్యవహరిస్తున్నారు.

బీజేపీ పెట్టిన 40 నాయకుల టార్గెట్ కోసం ఈటల గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు తమ నాయకులు చేజారకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఆయన టార్గెట్ పూర్తి చేయలేక, హై కమాండ్‌కు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నట్లు సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని చెప్తున్న ఈటల ఎంత మేరకు విజయం సాధిస్తారనేది వేచి చూడాలి.

First Published:  26 July 2022 7:37 AM GMT
Next Story