Telugu Global
Telangana

మునుగోడులో వేలల్లో కొత్త ఓట్ల నమోదు.. కోర్టు మెట్లెక్కిన బీజేపీ

కొత్తగా నమోదైన ఓట్లలో మెజారిటీ ఓట్లు నకిలీవని బీజేపీ నాయకులు కోర్టుకు విన్నవించారు. పాత ఓటర్ల లిస్టు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని వారు కోర్టును కోరారు.

మునుగోడులో వేలల్లో కొత్త ఓట్ల నమోదు.. కోర్టు మెట్లెక్కిన బీజేపీ
X

మునుగోడులో కాంగ్రెస్‌కు, తన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో చేరి మళ్లీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అయితే ఈ ఎన్నికలను బీజేపీతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికల్లో విజయం సాధించి అదే ఉత్సాహంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ముఖ్య పార్టీలన్నీ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఒక పార్టీపై మరో పార్టీ నేతల విమర్శలు.. ప్రతి విమర్శలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా మునుగోడులో ఉప ఎన్నిక జరిగేందుకు సమయం దగ్గర పడుతుండగా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వేల కొద్ది నమోదు అవుతున్న కొత్త ఓట్లు కలకలం సృష్టిస్తున్నాయి.

మామూలుగా ఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే అక్కడ కొత్త ఓట్లు వందల్లో నమోదు అవడం మామూలే. అయితే మునుగోడులో ఏకంగా 23 వేల కొత్త ఓట్లు రిజిస్టర్ అయ్యాయి. అయితే ఇన్ని కొత్త ఓట్లు నమోదు కావడం వెనుక మతలబు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు నకిలీ ఓట్లను భారీగా నమోదు చేస్తున్నారనే విమర్శలు కొద్ది రోజులుగా వస్తున్నాయి.

కాగా, కొత్త ఓట్లు వేలల్లో నమోదు కావడంపై బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్తగా నమోదైన ఓట్లలో మెజారిటీ ఓట్లు నకిలీవని వారు కోర్టుకు విన్నవించారు. పాత ఓటర్ల లిస్టు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని వారు కోర్టును కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కంటే ముందున్న ఓటర్ లిస్ట్ ప్రకారం మునుగోడులో ఉప ఎన్నిక జరపాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

కాగా కొన్నేళ్ల కిందటే మునుగోడు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డవారు, నగరాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నవారిని ఒప్పించి ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కొందరు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

First Published:  12 Oct 2022 9:46 AM GMT
Next Story