Telugu Global
Telangana

ఆరు కాదు, మూడు గ్యారెంటీలు ఇవ్వండి చాలు..

ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందన్నారు. అధికారంలో ఉన్న కర్నాటకలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా అని నిలదీశారు డీకే అరుణ.

ఆరు కాదు, మూడు గ్యారెంటీలు ఇవ్వండి చాలు..
X

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. తుక్కుగూడ విజయభేరి సభలో స్వయంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే వాటిని అమలు చేసి తీరతామన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అయితే ఈ ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ అదిరిపోయే పంచ్ లు వేసింది. ఆరు గ్యారంటీలు కాదని, అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం తెరపైకి వస్తారని ఎద్దేవా చేశారు మంత్రి హరీష్ రావు. ఇప్పుడు బీజేపీ కూడా కాంగ్రెస్ గ్యారెంటీలపై సెటైర్లు పేలుస్తోంది. మాజీ మంత్రి డీకే అరుణ ఆరు గ్యారెంటీలను కామెడీ చేస్తూ కామెంట్లు చేశారు.

మూడు గ్యారెంటీలు చాలు..

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిందని, కానీ మూడు గ్యారెంటీలు చాలని, వాటిని అమలు చేస్తామని చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు డీకే అరుణ.

1. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరు

2. అధికారంలోకి వస్తే కుంభకోణాలు చేయము

3. తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోము

అంటూ మూడు గ్యారెంటీలను కాంగ్రెస్ ఇవ్వాలన్నారు డీకే అరుణ.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ విశ్వాసం కోల్పోయిందన్నారు డీకే అరుణ. మత విద్వేషాల పేరుతో బీజేపీని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందన్నారు. అధికారంలో ఉన్న కర్నాటకలో రూ.4వేల పెన్షన్ ఇస్తున్నారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మహిళల ఉచిత ప్రయాణాలతో కర్నాటక ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారైందని, ఆ సంస్థను అక్కడ ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని చెప్పారు డీకే అరుణ.


First Published:  19 Sep 2023 9:16 AM GMT
Next Story