Telugu Global
Telangana

రఘునందన్‌ రావుకు ఎదురీత తప్పదా..!

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి 2020లో జరిగిన ఉపఎన్నికలో రఘునందన్ రావు విజయం సాధించారు.

రఘునందన్‌ రావుకు ఎదురీత తప్పదా..!
X

తెలంగాణలో ఈసారి ఆసక్తి రేపుతున్న స్థానాల్లో దుబ్బాక ఒకటి. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌ రావు.. మరోసారి బీజేపీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఉపఎన్నికలోనే చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా విజయం సాధించిన రఘునందన్‌రావుకు.. ఈసారి షాక్‌ తప్పదనే ప్రచారం నడుస్తోంది.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక స్థానానికి 2020లో జరిగిన ఉపఎన్నికలో రఘునందన్ రావు విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత రెడ్డిని బరిలో నిలిపింది బీఆర్ఎస్. అయితే ఈ ఉపఎన్నికలో రఘునందన్ రావు విజయం సాధించింది కేవలం 1079 ఓట్ల తేడాతో మాత్రమే. ఆ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ ఓటమికి ప్రధాన కారణం బలహీన అభ్యర్థిని నిలపడమే.

భౌగోళికంగా కేసీఆర్‌, కేటీఆర్, హరీష్‌ రావులు ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలతో సరిహద్దును పంచుకుంటున్న దుబ్బాకలో ఈసారి గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి సొంత నియోజకవర్గం కావడంతో ఆయనను దుబ్బాక బరిలో నిలిపింది బీఆర్ఎస్. ఇక ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరగడంతో.. ప్రచార బాధ్యతలు తన భుజాన వేసుకున్నారు మంత్రి హరీష్‌ రావు. ఇక కేటీఆర్ సైతం ఇటీవల నియోజకవర్గంలో రోడ్‌ షో నిర్వహించారు. ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ రఘునందన్ రావును టార్గెట్ చేశారు మంత్రులు కేటీఆర్, హరీశ్‌. రఘునందన్ రావు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.

ఇక రఘునందన్‌రావుకు రాష్ట్రనాయకత్వం నుంచి సహకారం కొరవడింది. ఢిల్లీ పెద్దలు రఘునందన్‌ రావుకు మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ.. వారి ప్రసంగాలు ఓటర్లకు చేరువకాలేకపోతున్నాయి. ఉపఎన్నిక సమయంలో జితేందర్ రెడ్డి, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు నియోజకవర్గంలో రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించడంతో పాటు ఆర్థికంగా మద్దతుగా నిలిచారు. అయితే ఈ సారి వారిలో చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోవడం.. మిగతా వాళ్లు వారి సొంత నియోజకవర్గాల్లో బిజీగా ఉండడంతో రఘునందన్ రావు ఒంటరయ్యారు. ఇక గడిచిన మూడేళ్లలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో రఘునందన్‌ రావుపై నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. దీంతో ఈ సారి మార్పు కోరుకుంటున్నారని సమాచారం.

First Published:  23 Nov 2023 5:01 AM GMT
Next Story