Telugu Global
Telangana

పైసలు ఫుల్, ప్రచారం డల్.. చేతులెత్తేసిన బీజేపీ..

రాజగోపాల్ రెడ్డి దగ్గర కాంట్రాక్ట్ పనుల పైసలు ఫుల్ గా ఉన్నాయి, కానీ మునుగోడులో ప్రచారం మాత్రం డల్ గా సాగుతోంది. బీజేపీ జాతీయ నాయకులు కూడా మునుగోడు వైపు కన్నెత్తి చూడటంలేదు.

పైసలు ఫుల్, ప్రచారం డల్.. చేతులెత్తేసిన బీజేపీ..
X

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా కండువా కప్పిన సభ మినహా బీజేపీ హడావిడి లేనే లేదు. కేంద్ర మంత్రులు వస్తారు, మునుగోడులో తిష్ట వేస్తారు, ఇతర రాష్ట్రాల సీఎంలు వస్తారు, రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు అనేది.. వట్టి ప్రచారమేనని తేలిపోయింది. ఆఖరికి రాష్ట్ర పార్టీ నేతలు కూడా రాజగోపాల్ రెడ్డిని పట్టించుకోవడంలేదు. పాదయాత్ర తర్వాత మునుగోడులో సుడిగాలి పర్యటన చేస్తానన్న బండి సంజయ్ కూడా పత్తా లేరు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మునుగోడు ఎన్నికతో తనకేమాత్రం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

బీజేపీ చేతులెత్తేసినట్టేనా..?

మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి ఖాయమని ముందే తేలిపోయింది. కనీసం గట్టి పోటీ ఇస్తామనే నమ్మకం కూడా కేంద్ర నాయకత్వంలో లేదు. అటు కాంగ్రెస్ నుంచి వలసలు కూడా లేవు. ఈ దశలో మునుగోడులో మూడో స్థానమే దిక్కు అని డిసైడ్ అయిన బీజేపీ అధినాయకత్వం ముందుగానే కాడె పడేసింది. రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్ పనులు ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రచారంతో పనికాదు, ఏదైనా ఉంటే ఓటుకు నోటుతోనే జనాల్ని ఆకర్షించాలని హితబోధ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకోసం ఢిల్లీ నాయకుల్ని హైదరాబాద్ గల్లీల్లో తిప్పి హడావిడి చేసిన బీజేపీ, ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక విషయంలో ఆ స్థాయి హంగామా చేయలేకపోతోంది. ఒకరకంగా ఎన్నికలకు ముందే పార్టీ చేతులెత్తేసినట్టయింది.

వాటా ఆ ఇద్దరికేనా..?

రాజగోపాల్ రెడ్డి చేజిక్కించుకున్న 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనుల్లో ఇద్దరు నాయకులకు వాటా వెళ్తుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈటల, వివేక్ కూడా ఆ పనుల్ని పంచుకుంటారని అంటున్నారు. దీంతో సహజంగానే మిగతా నాయకులకు కడుపుమండింది. ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి పక్కన నిలబడాలంటే తమకూ వాటా కావాలంటున్నారు. ఈ ఉప ఎన్నిక విషయంలో ఈటల అత్యుత్సాహానికి కారణం అదేనా అని రాగాలు తీస్తున్నారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు తీసుకున్న రాజగోపాల్ రెడ్డి.. మిగతా నాయకులకంటే భారీగా ఖర్చు పెట్టాలని, తమని మరింతగా సంతోష పెట్టాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అందుకే వారు ప్రచారానికి రాకుండా కాస్త బెట్టు చేస్తున్నారు.

గెలుపు కోసం కాదు కదా..?

రాజగోపాల్ రెడ్డికి కావాల్సింది ఎమ్మెల్యే పదవి కాదు, కాంట్రాక్ట్ లు. అందుకే ఆయన పదవిని వదులుకుని కాంట్రాక్ట్ పనులు పుచ్చుకున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ఆయన కూడా బాగా డల్ అయ్యారని తెలుస్తోంది. పైగా టీవీ షో లో తన రహస్యాన్ని తానే బయట పెట్టుకోవడం ఆయనకు పెద్ద మైనస్ గా మారింది. ఇక ఏం చెప్పినా జనాలు వినబోరని రాజగోపాల్ రెడ్డికి అర్థమైంది.

First Published:  10 Oct 2022 2:26 AM GMT
Next Story