Telugu Global
Telangana

బీసీ సభలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా..?

ఎలాగూ అధికారంలోకి రాలేం కాబట్టి.. ఆ బీసీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయం ప్రకటిస్తే పోలేదా అనే వాదన వినపడుతోంది. ఆ ప్రకటన తర్వాత వైరి వర్గాల్లో వణుకు మొదలవుతుందనే అంచనా బీజేపీది.

బీసీ సభలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా..?
X

బీసీ సభలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా..?

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామంటూ ఆమధ్య కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కి ఆ ధైర్యముందా అంటూ బీజేపీ ఆల్రడీ సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో ఈనెల 7న జరగబోయే బీసీ సభలో ఆ సీఎం అభ్యర్థి ఎవరో కూడా బీజేపీ ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ బీసీ సభకు హాజరవుతారు. ఆ సభలోనే మోదీ తెలంగాణ బీసీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ప్రకటన చేస్తారని అంటున్నారు. అయితే మోదీ అంత ధైర్యం చేయకపోవచ్చనే వాదన కూాడా వినపడుతోంది.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కనీసం 1 పర్సెంట్ కూడా లేదని తేలిపోయింది. ఆ పార్టీకి వచ్చే సీట్లు 10లోపే అని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఒక్క సర్వే కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో బీసీ సీఎం అంటూ బీజేపీ కొత్త స్ట్రాటజీ మొదలు పెట్టింది. దానివల్ల ఏకంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనుకోలేం కానీ, బీసీల ఓట్లు పడతాయనే ఆశ మాత్రం నాయకుల్లో ఉంది. ఎలాగూ అధికారంలోకి రాలేం కాబట్టి.. ఆ బీసీ సీఎం అభ్యర్థి ఎవరనే విషయం ప్రకటిస్తే పోలేదా అనే వాదన కూడా వినపడుతోంది. ఆ ప్రకటన తర్వాత వైరి వర్గాల్లో వణుకు మొదలవుతుందనే అంచనా బీజేపీది.

ఈ నెల 7న సాయంత్రం 5.30గంటలకు హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బీసీ గర్జన సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీ నేతలు హాజరవుతారని అంచనా. పవన్ కల్యాణ్ కి కూడా ఆహ్వానం అందింది, ఆయన కూడా సభకు వస్తానని ప్రకటించారు. ఈ కీలక సభలో బీసీ సీఎం అభ్యర్థి ఫలానా అంటూ మోదీ ప్రకటిస్తారనే ప్రచారం వినపడుతోంది. బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీకి అనుకూలంగా బీసీల మద్దతు కూడగట్టవచ్చని నేతలు అంచనా వేస్తున్నారు.

ఈనెల 11న మరో సభ..

ఈ నెల 11న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే మాదిగల ఆత్మగౌరవసభకు కూడా ప్రధాని మోదీ హాజవుతారు. ఈ సభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తమ పార్టీ అనుకూలం అని మోదీ ప్రకటించే అవకాశముంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోపాటు రాష్ట్రంలో ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కూడా బీజేపీ పరిశీలిస్తుందని మోదీ చెప్పొచ్చు.

First Published:  5 Nov 2023 6:06 AM GMT
Next Story