Telugu Global
Telangana

తెలంగాణ సెక్రటేరియట్‌పై బీజేపీ మత తత్వ ట్వీట్ లు -ఫైర్ అవుతున్న నెటిజన్లు

హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని నెటిజన్లు బీజేపీని కోరారు. “మేము హైదరాబాద్‌లో చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నాము, దానిని పాడుచేయకండి. మతాన్ని మీ USP గా మార్చకండి. ఇంకేదైనా మెరుగ్గా ప్రయత్నించండి’’ అని బీజేపీ ట్వీట్‌కు ట్విట్టర్ యూజర్ ఒకరు బదులిచ్చారు.

తెలంగాణ సెక్రటేరియట్‌పై బీజేపీ మత తత్వ ట్వీట్ లు -ఫైర్ అవుతున్న నెటిజన్లు
X

తెలంగాణ నూతన సెక్రటేరియట్‌పై బీజేపీ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ @BJP4Telangana చేసిన‌ ట్వీట్, కొత్త రాష్ట్ర సచివాలయ భవనం మసీదును పోలి ఉందని, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, వైభవం నిర్మాణంలో ప్రతిబింబించలేదని పేర్కొంది. హిందూ సమాజం భావోద్వేగాలు భవనంలో ప్రతిబింబించలేదని ఆరోపించింది. సచివాలయం కేవలం AIMIMని సంతోషపెట్టడానికి మాత్రమే అని ఆరోపించింది.

కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా ఇలాంటి విమర్శలే చేశారు. ఇప్పుడు అదే ప్రచారాన్ని ట్విట్టర్ లో ప్రారంభించారని నెటిజన్లు మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు, మైసూర్ ప్యాలెస్, గుజరాత్ అసెంబ్లీ భవనం వంటి దేశంలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో డూంలు అంతర్భాగమని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. కర్ణాటకతో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సెక్రటేరియట్, అసెంబ్లీ చిత్రాలను ట్వీట్ చేశారు. వాటి నిర్మాణం కూడా అలాగే ఉందని ఎత్తి చూపారు.

ప్రభుత్వం చేసే ప్రతి చర్యలోనూ మతపరమైన కోణాలను తవ్వే ప్రయత్నం చేయకుండా, దానిని ఒక గొప్ప నిర్మాణంగా ఎందుకు చూడకూడదని పలువురు నెటిజన్లు బీజేపీని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాజ్ మహల్ చిత్రాన్ని బహూకరిస్తున్న ఫోటోను కూడా ఒక ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.

హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని నెటిజన్లు బీజేపీని కోరారు. “మేము హైదరాబాద్‌లో చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్నాము, దానిని పాడుచేయకండి. మతాన్ని మీ USP గా మార్చకండి. ఇంకేదైనా మెరుగ్గా ప్రయత్నించండి’’ అని బీజేపీ ట్వీట్‌కు ట్విట్టర్ యూజర్ ఒకరు బదులిచ్చారు.

మరొక నెటిజన్ భారత పార్లమెంటు చిత్రాన్ని ట్వీట్ చేసి, దాని నిర్మాణం దేవాలయాలను ప్రతిబింబిస్తుందా..? జనాభాలో 85 శాతం మంది మతపరమైన మనోభావాలను సంతృప్తి పరుస్తుందా..? అని బీజేపీని ప్రశ్నించారు.

First Published:  29 April 2023 8:06 AM GMT
Next Story