Telugu Global
Telangana

ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేయడానికి ప్రత్యేక విచారణ బృందం (సిట్) లేదా సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది.

ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
X

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ మధ్యవర్తులు బేరసారాలు నిర్వహించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 400 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నించిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా అప్రమత్తం అయ్యింది. స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ఉదయం నుంచి ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక దశలో అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై రివర్స్ ఎటాక్ చేశారు.అయినా సరే ప్రజల్లో పెద్దగా నమ్మకం కుదరక పోవడంతో సీబీఐ లేదా సిట్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు చేయడానికి ప్రత్యేక విచారణ బృందం (సిట్) లేదా సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది. ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని, వారి వ్యవహారంపై అభ్యంతరాలు కూడా ఉన్నాయని బీజేపీ పేర్కొన్నది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ జరిపించాలని బీజేపీ అభ్యర్థించినట్లు తెలుస్తున్నది. బీజేపీ తరపున ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకే టీఆర్ఎస్ నేతలు బీజేపీపై కుట్ర చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ కమిషనరేట్, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ ఎస్‌హెచ్ఓ, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహా ఎనిమిది మందిని అందులో ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ఇక ఫామ్‌హౌస్ ఘటనపై పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. వ్యవసాయ క్షేత్రంలో అణువణువూ గాలింపు చేపట్టారు. శంషాబాద్ డీసీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ సీఐల నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతున్నది. ముగ్గురు నిందితులను విచారించిన పోలీసులు, వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. నర్కెడ పీహెచ్‌సీ డాక్టర్ వారికి వైద్య పరీక్షలు చేశారు. కాపేపట్లో వారిని కోర్టులో ప్రవేవపెట్టనున్నారు.

Next Story