Telugu Global
Telangana

బైక్ వద్దు, కారే కావాలి..

ద్విచక్ర వాహనాల విక్రయాలు 2019 నుంచి తెలంగాణలో తగ్గుతూ వస్తున్నాయి. మారుతున్న జీవన విధానం, ఆదాయంలో పెరుగుదల కూడా బైక్ ల కంటే కార్ల అమ్మకాలు ఎక్కువ కావడానికి కారణం అని తేలుతోంది.

బైక్ వద్దు, కారే కావాలి..
X

ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగత రవాణా సాధనం సైకిల్. ఆ తర్వాత సైకిల్ స్థానంలో బైక్ వచ్చింది. ఇప్పుడు బైక్ లు, స్కూటీలపై కూడా జనాలకు మోజు తీరిపోయింది. మధ్యతరగతి కుటుంబాలు కూడా కార్లపైనే ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో వ్యక్తిగత రవాణాకోసం అందరూ కార్ల వైపే మొగ్గుచూపారు. తెలంగాణలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి, అదే సమయంలో బైక్ ల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోవడం విశేషం.

2019-20తో పోలిస్తే 2021-22లో తెలంగాణ రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 2.7 లక్షల వరకు తగ్గింది. అదే సమయంలో కొత్త కార్ల రిజిస్ట్రేషన్లు 22,760 వరకు పెరిగాయి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగింది. 2021-22లో తెలంగాణ కొత్త కార్లు కొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సంఖ్య 1.60 లక్షలు కాగా, 2022-23లో ఇప్పటికే 1.62 లక్షలకు చేరింది. మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య రెండు లక్షలు దాటే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కేవలం కొత్త కార్ల లెక్కలే, సెకండ్ హ్యాండ్ కార్ల లెక్కలు కూడా తీస్తే వాటి సంఖ్య మరింత ఎక్కువ అని చెబుతున్నారు.

రేట్ల పెరుగుదల ప్రభావం..

ప్రస్తుతం టూవీలర్ కొత్తది కొనాలంటే లక్ష రూపాయల పైనే అవుతుంది. హైఎండ్‌ మోడళ్ల రేటు మరీ ఎక్కువ. గడిచిన నాలుగేళ్లలో ఒక్కో వాహనం ధర కనీసం రూ.10 వేలు పెరిగింది. బైక్ లో హైఎండ్ మోడల్ కొనే బదులు అదే రేటులో ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవచ్చు. ఇంకాస్త డబ్బులు పెట్టుకుంటే, ఈఎంపై ఫెసిలిటీతో కొత్తకారే కొనుక్కోవచ్చు. దీంతో ఎక్కువమంది కొత్త కార్లవైపు మొగ్గుచూపుతున్నారు.

మారుతున్న జీవన విధానం, ఆదాయంలో పెరుగుదల కూడా బైక్ ల కంటే కార్ల అమ్మకాలు ఎక్కువ కావడానికి కారణం అని తేలుతోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వచ్చినవారు, సొంతూరుకు వెళ్లిరావడానికి వీలుగా కార్లు కొనుగోలు చేస్తున్నారు.

2019నుంచి మార్పు స్పష్టం..

ద్విచక్రవాహనాల విక్రయాలు 2019 నుంచి తెలంగాణలో తగ్గుతూ వస్తున్నాయి. కరోనా భయంతో అప్పట్లో చాలామంది కార్ల కొనుగోలుకి మొగ్గుచూపారు. అప్పట్నుంచే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గడం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి ఉందని అంటున్నారు రవాణాశాఖ అధికారులు.

First Published:  17 Feb 2023 6:07 AM GMT
Next Story