Telugu Global
Telangana

బిగ్ బాస్ విధ్వంసం.. చంచల్ గూడ జైలులో రైతుబిడ్డ

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి రెండు వారాలు రిమాండ్ విధించడంతో రాత్రి పల్లవి ప్రశాంత్ ని, ఆయన తమ్ముడు మనోహర్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు.

బిగ్ బాస్ విధ్వంసం.. చంచల్ గూడ జైలులో రైతుబిడ్డ
X

తెలుగు బిగ్ బాస్ షో చరిత్రలో ఇది ఓ పెద్ద ట్విస్ట్. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయిన వ్యక్తి ఇంటర్వ్యూలు, సభలు, సన్మానాలతో హడావిడిగా ఉండాల్సిన వేళ తాజా విన్నర్ మాత్రం చంచల్ గూడ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్జి రెండు వారాలు రిమాండ్ విధించడంతో రాత్రి పల్లవి ప్రశాంత్ ని, ఆయన తమ్ముడు మనోహర్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు.


అసలేం జరిగింది..?

ఈనెల 17న బిగ్ బాస్ ఫైనల్ సందర్భంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణలు జరిగాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి ఘన స్వాగతం పలికేందుకు స్టూడియో వద్దకు వచ్చిన ఆయన అభిమానులు రచ్చ రచ్చ చేశారు. రెండో స్థానంలో నిలిచిన అమర్ దీప్ కారుపై దాడికి దిగారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే కారణంతో వారిపై కేసు పెట్టారు పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదని చెప్పినా కూడా పల్లవి ప్రశాంత్ వినకపోవడంతో ఆయనపై కూడా కేసు నమోదైంది. మొత్తం ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని ఇదివరకే అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. చివరిగా పల్లవి ప్రశాంత్, ఆయన సోదరుడు మనోహర్ ని.. గజ్వేల్ మండలం కొల్గూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. పల్లవి ప్రశాంత్ పై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. జడ్జి రిమాండ్ విధించడంతో అర్థరాత్రి పల్లవి ప్రశాంత్, మనోహర్ ని పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు.

రైతుబిడ్డగా, కామన్ మ్యాన్‏ గా బిగ్‏బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ ట్రోఫీ సాధించారు. రైతుబిడ్డగా ఆయన్ను చాలామంది అభిమానించారు, ఓటింగ్ తో సపోర్ట్ చేశారు. కానీ బయటకొచ్చిన తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయింది. అభిమానుల అత్యుత్సాహం పల్లవి ప్రశాంత్ కి తలనొప్పి తెచ్చిపెట్టింది. అభిమానుల చేసిన ఆస్తుల విధ్వంసంతోపాటు.. పోలీసులు వారిస్తున్నా ర్యాలీ చేపట్టిన పల్లవి ప్రశాంత్ కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి ఇలా జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

First Published:  21 Dec 2023 2:41 AM GMT
Next Story