Telugu Global
Telangana

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌.. రేవంత్ సంచలన నిర్ణయం

33ఏళ్లు సర్వీసు నిండిన వాళ్లను కూడా పదవీ విరమణ చేయించడం అనేది ఇక్కడ కీలకమైన అంశం. కొంత మంది 20ఏళ్లకే ఉద్యోగంలో చేరిన వాళ్లుంటారు. వాళ్లు 53ఏళ్లకే ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి.

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ షాక్‌.. రేవంత్ సంచలన నిర్ణయం
X

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోపోబోతోంది. 33 ఏళ్ల సర్వీసు లేదా 61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందుగా పూర్తయితే అది. ఆ అధికారుల తక్షణ పదవీ విరమణకు ఏర్పాట్లు చేయాలని రేవంత్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనివల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫైల్ ఆమోదం కోసం అధికారులు దానిని సీఎంవోకు పంపారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన ఫైల్‌ ఆమోదానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనికి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 మార్చిలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. అప్పటినుంచి ప్రభుత్వ శాఖలతోపాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, వర్సిటీల్లోఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును సైతం 61కి పెంచింది. రేవంత్‌ సర్కారు తీసుకోబోతున్న తాజా నిర్ణయంతో భారీగా ఉద్యోగ ఖాళీలు ఏర్పడబోతున్నాయి.

నిరుద్యోగులకు ఇది గుడ్‌ న్యూసే అయినా 33ఏళ్లు సర్వీసు నిండిన వాళ్లను కూడా పదవీ విరమణ చేయించడం అనేది ఇక్కడ కీలకమైన అంశం. కొంత మంది 20ఏళ్లకే ఉద్యోగంలో చేరిన వాళ్లుంటారు. వాళ్లు 53ఏళ్లకే ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  12 April 2024 10:25 AM GMT
Next Story