Telugu Global
Telangana

ఖమ్మంలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌..!

పాలేరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన సంభాని చంద్రశేఖర్‌.. వైఎస్ఆర్‌ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు.

ఖమ్మంలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌..!
X

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్ అధ్య‌క్షులు, సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, తెలంగాణ ఉద్యమ నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ సహా పలువురు సీనియర్ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు.

పాలేరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన సంభాని చంద్రశేఖర్‌.. వైఎస్ఆర్‌ హయాంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. సంభాని విజ్ఞప్తిని పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం సత్తుపల్లి నుంచి మట్టా రాగమయికి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్‌ తీరుతో తీవ్ర నిరాశకు గురైన సంభాని ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

ఇక ఎడవల్లి కృష్ణ కొత్తగూడెం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే పట్టించుకోలేదన్న నిరాశతో హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఇక మరో కీలక నేత కోటూరి మానవతా రాయ్‌కి సైతం టికెట్ నిరాక‌రించింది కాంగ్రెస్‌ పార్టీ. ఉద్యమకారుల కోటాలో తనకు సత్తుపల్లి సీటు దక్కుతుందనుకున్న మానవతా రాయ్‌కి చివరకు నిరాశే మిగిలింది. దీంతో ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. ఖమ్మం జిల్లాలో వరుస చేరికలు బీఆర్ఎస్‌లో జోష్‌ నింపుతుండగా.. కాంగ్రెస్‌ డీలా పడుతోంది.

First Published:  10 Nov 2023 2:58 PM GMT
Next Story