Telugu Global
Telangana

భట్టి విక్రమార్క Vs మంత్రులు... అసెంబ్లీలో హాట్ కామెంట్స్

భట్టి విక్రమార్క విషయం నుండి పక్కకు పోవద్దని స్పీకర్ హెచ్చరించారు. విక్రమార్క గంటల తరబడి మాట్లాడటం సరికాదని, ఇతర సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్ అన్నారు.

భట్టి విక్రమార్క Vs మంత్రులు... అసెంబ్లీలో హాట్ కామెంట్స్
X

శనివారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క పై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు టి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, చురకలంటించారు.

భట్టి విక్రమార్క విషయం నుండి పక్కకు పోవద్దని స్పీకర్ హెచ్చరించారు. విక్రమార్క గంటల తరబడి మాట్లాడటం సరికాదని, ఇతర సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని స్పీకర్ అన్నారు.

అసెంబ్లీలో 13 అంశాలపై జరిగిన చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ఘనతను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు సంబంధించిన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కేంద్ర జలసంఘానికి సమర్పించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం MGNREGS కింద రూ.800 కోట్ల బిల్లులను పెండింగ్‌లో ఉంచిందని ఆరోపించారు భట్టి.

పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోక్యం చేసుకుంటూ, రూ.150 కోట్లతో వరి ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణానికి కేంద్రం అభ్యంతరం చెబుతూ ఆ సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నదని, దానిని కారణంగా చూపి రాష్ట్రానికి రావాల్సిన 800 కోట్ల MGNREGS నిధులను ఆపేసిందని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీలు MGNREGS అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని ఆయన కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని పంప్‌హౌజ్‌లు నీట మునిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సందర్శించేందుకు అనుమతించ లేదని భట్టి విక్రమార్క ఆరోపించగా, వరద‌ల కారణంగా వారిని అనుమతించలేదని హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతున్నట్లు ఆయన ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎల్‌ఐఎస్‌ డీపీఆర్‌ను గతేడాది సెప్టెంబర్‌ 19న కేంద్ర జలసంఘానికి సమర్పించినట్లు ఆయన‌ తెలిపారు.

''కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టులకు అప్పుడే శంకుస్థాపన చేసి పంప్ హౌస్‌ల నిర్మాణానికి బిల్లులు క్లెయిమ్ చేసింది. కాంగ్రెస్‌ హయాంలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో నెట్టపాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల కింద కేవలం 27,300 ఎకరాలు మాత్రమే సాగయ్యేది. అయితే ఈ మూడు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 3,663 కోట్లు వెచ్చించి 5.69 లక్షల ఎకరాలకు నీరు అందజేస్తోంది.'' అని హరీశ్ రావు తెలిపారు.

First Published:  11 Feb 2023 2:05 PM GMT
Next Story