Telugu Global
Telangana

సోనియా రుణం అలా తీర్చుకోవాలి.. లాజిక్ చెప్పిన భట్టి

అసలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారో లేదో తేలకముందే ఇతర పార్టీలకు ఇలాంటి సలహాలివ్వడం విచిత్రంగా తోస్తోంది. భట్టి లాజిక్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

సోనియా రుణం అలా తీర్చుకోవాలి.. లాజిక్ చెప్పిన భట్టి
X

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం ఎలా తీర్చుకోవాలంటే..? అంటూ ఓ విచిత్రమైన లాజిక్ చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణలో సోనియా గాంధీ పోటీ చేయబోయే లోక్ సభ నియోజకవర్గంలో ఇతర పార్టీలేవీ అభ్యర్థుల్ని నిలబెట్టకూడదన్నారు. తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీ కూడా ఆ స్థానంలో పోటీ చేయకూడదని చెప్పారు. అసలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేస్తుందో లేదో తేలకముందే ఇతర పార్టీలకు ఇలాంటి సలహాలివ్వడం విచిత్రంగా తోస్తోంది. భట్టి లాజిక్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

రుణం తీర్చుకోవాల్సింది ఎవరు..?

తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇవ్వడమేంటి..? తప్పనిసరి పరిస్థితులు సృష్టించి రాష్ట్రాన్ని సాధించామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర ఏర్పాటులో మా సహకారం కూడా ఉందంటారు బీజేపీ నేతలు. ఆ మాటకొస్తే టీడీపీ కూడా తమ వాటా ఉందని చెప్పుకుంటుంది. పోనీ సోనియాగాంధీ వల్లే తెలంగాణ ఏర్పడింది అని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నా.. ఆమె రుణం తీర్చుకోవాల్సింది ఎవరు..? రుణం తీర్చుకోవాలంటే ఆమెకు భారీ మెజార్టీ ఇవ్వండి అని కాంగ్రెస్ నేతలు ప్రజల్ని అభ్యర్థిస్తే.. అందులో ఎంతో కొంత నిజాయితీ ఉందనుకోవచ్చు. ఆమె పోటీ చేయాలనుకుంటున్న స్థానం నుంచి అభ్యర్థులెవర్నీ బరిలో దింపొద్దు అని పక్క పార్టీలకు ఉచిత సలహాలివ్వడం మాత్రం ఇక్కడ ఆసక్తికర అంశం. మరి డిప్యూటీ సీఎం భట్టి ఈ లాజిక్ ఎందుకు చెప్పారో ఆయనకే తెలియాలి.

తెలంగాణ బీజేపీ నాయకులు బాధ్యత లేనట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు భట్టి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయల నగదు జమ, నోట్ల రద్దు సమయంలో బయటికి తీస్తానన్న నల్లధనం గురించి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. మోసం మోసమని బతికే బీజేపీ లాగా కాంగ్రెస్ ఉండదన్నారు. రాష్ట్రంలో చిన్నాభిన్నంగా ఉన్న పాలనా వ్యవస్థను గాడిలో పెట్టి జవాబుదారీ పాలన అందిస్తున్నామని చెప్పారాయన. రాష్ట్రంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛ, స్వాతంత్రం, ఒత్తిడి లేని పాలన అందిస్తున్నామని అన్నారు భట్టి.

First Published:  7 Jan 2024 4:56 PM GMT
Next Story