Telugu Global
Telangana

కాంగ్రెస్ లో కలకలం.. భట్టిలో అసంతృప్తి నిజమేనా..?

అధికారిక కార్యక్రమాలన్నిటిలో సీఎంతో పాటు హాజరవుతున్న డిప్యూటీ సీఎం భట్టి.. గవర్నర్ ప్రోగ్రామ్ కి గైర్హాజరవడం ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ లో కలకలం.. భట్టిలో అసంతృప్తి నిజమేనా..?
X

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కలకలం రేగింది. యాదాద్రిలో పీటల వ్యవహారం మరింత ముదిరిందని అంటున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అప్పట్లోనే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే స్వయానా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో ఈ అంశాన్ని ప్రస్తావించడంతో, కాంగ్రెస్ అధిష్టానం పీటల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నదని సమాచారం. ఇక మీడియా ముందు కవర్ చేసినా, భట్టి విక్రమార్క ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారని, అధిష్టానానికి తన కుటుంబ సభ్యుల ద్వారా ఫిర్యాదు చేయించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అధిష్టానానికి వివరణ ఇచ్చుకున్నారని అంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే అయినా.. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భట్టి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు భట్టి ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమానికి రాలేదని ఆయన వర్గం చెబుతోంది. భట్టితోపాటు, రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా ప్రత్యేక అనుమతితో ఆయన గవర్నర్ కార్యక్రమానికి వచ్చారు. అధికారిక కార్యక్రమాలన్నిటిలో సీఎంతో పాటు హాజరవుతున్న డిప్యూటీ సీఎం భట్టి.. గవర్నర్ ప్రోగ్రామ్ కి గైర్హాజరవడం మాత్రం ఆసక్తికరంగా మారింది.

అక్కడే మొదలు..

ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల పోస్టర్లు, ఫ్లెక్సీల్లో డిప్యూటీ సీఎం భట్టికి ప్రాధాన్యత తగ్గిపోవడంతో.. ఆయన వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉందన్న విషయం వాస్తవం. కానీ ఈ అంతర్గత కలహాలు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. అదే సమయంలో భట్టికి అన్యాయం జరుగుతుందేమోననే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతానికి ఆయన సైలెంట్ గా ఉన్నారు. భట్టి విక్రమార్క సతీమణి ఖమ్మం లోక్ సభ సీటు ఆశిస్తున్న ఈ తరుణంలో అనవసరపు వివాదాలెందుకని సర్దుకుపోతున్నారు. లోక్ సభ సీట్ల కేటాయింపుల్లో రికమండేషన్లు కుదరకపోతే మాత్రం కాంగ్రెస్ లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం బయటపడక మానదు.

First Published:  21 March 2024 1:53 AM GMT
Next Story