Telugu Global
Telangana

తెలంగాణ మరో ముందడుగు.. అన్ని జిల్లాల్లోనూ భరోసా

లైంగిక వేంధింపులు, గృహహింస, ఈవ్ టీజింగ్‌ వంటి ఇబ్బందులు ఎదురైనవారికి భరోసా కేంద్రం బాసటగా నిలుస్తుంది. అవసరమైన వైద్య, న్యాయ సౌకర్యాలు, కౌన్సెలింగ్‌ తోపాటు, తాత్కాలిక రక్షణ కూడా కల్పిస్తుంది.

తెలంగాణ మరో ముందడుగు.. అన్ని జిల్లాల్లోనూ భరోసా
X

భరోసా కేంద్రం. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో అత్యంత ఆదరణ పొందిన ప్రాజెక్ట్ ఇది. ఆపదలో ఉన్న బాలికలు, మహిళలకు సాయం చేసే ఉద్దేశంతో తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మకంగా మొదట హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండల్లో వీటిని ఏర్పాటు చేశారు. జుబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో బాధితురాలి సమస్య భరోసా కేంద్రం వల్లనే వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా భరోసా కేంద్రానికి వచ్చి ఫిర్యాదు చేశారు. క్రమక్రమంగా ఈ కేంద్రాలకు ఆదరణ పెరుగుతుండటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వీటిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌.. తదితర జిల్లాల్లోఈ కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి అన్ని జిల్లాల్లో భరోసా కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.




భరోసా ఎలా ఇస్తారు..?

పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, అందులోనూ మహిళలకు ప్రత్యేక విభాగాలున్నాయి కదా, మళ్లీ ఈ భరోసా కేంద్రాలేంటి అనే అనుమానం మొదట్లో అందరికీ వచ్చింది. అయితే ఈ భరోసా కేంద్రాలు విజయవంతం కావడంతో వాటి విలువ తెలిసొచ్చింది. లైంగిక వేంధింపులు, గృహహింస, ఈవ్ టీజింగ్‌ వంటి ఇబ్బందులు ఎదురైనవారికి భరోసా కేంద్రం బాసటగా నిలుస్తుంది. అవసరమైన వైద్య, న్యాయ సౌకర్యాలు, కౌన్సెలింగ్‌ తోపాటు, తాత్కాలిక రక్షణ కూడా కల్పిస్తుంది. కేసు నమోదు చేయడం భరోసా కేంద్రాల ప్రధాన విధి. పోలీస్ స్టేషన్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడే మహిళలకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోంది. న్యాయ సహాయం కూడా అందిస్తుండటంతో చాలామంది బాధితులు భరోసా కేంద్రాలవైపు చూస్తున్నారు.




రూ.15కోట్లు విడుదల..

ఆపదలో ఉన్న అతివకు అండగా నిలుస్తున్న భరోసా కేంద్రాలను తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం 12 జిల్లాల్లో వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి. 2023 చివరినాటికి మిగిలిన జిల్లాకేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు మహిళా భద్రతా విభాగం ప్రణాళిక రెడీ చేసింది. మహిళా శిశు సంక్షేమశాఖ రూ.15 కోట్లు నిధులు విడుదల చేసింది.

First Published:  17 Jan 2023 11:59 PM GMT
Next Story