Telugu Global
Telangana

భారత్ జోడో యాత్ర.. తెలంగాణలో అన్నీ బ్రేకులే!

నవంబర్ 1న పాదయాత్ర హైదరాబాద్ శివారుకు చేరుకోనున్నది. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు శంషాబాద్ మాతా దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

భారత్ జోడో యాత్ర.. తెలంగాణలో అన్నీ బ్రేకులే!
X

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పాదయాత్రం కేరళ, కర్ణాటకలో విజయవంతంగా పూర్తి చేసుకొని ఏపీలోకి అడుగు పెట్టింది. నాలుగు రోజుల పాటు ఏపీలో రాహుల్ పాదయాత్ర కొనసాగనున్నది. ఏపీ సరిహద్దు గ్రామమైన హలహర్వి (కర్నూలు జిల్లా) నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు ఆలూరులో ఉదయం యాత్ర ముగుస్తుంది. రాత్రికి చాగిలో ఆయన బస చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో జరుగుతున్న పాదయాత్రకు ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకున్నారు. వీరితో పాటు కొంత మంది తెలంగాణ నాయకులు కూడా వెంట నడుస్తున్నారు. ఏపీలో 96 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనున్నది. ఈ నెల 21 వరకు ఏపీలో పాదయాత్ర కొనసాగిన తర్వాత.. 23న జోడో యాత్రం తెలంగాణలోకి ప్రవేశించనున్నది.

నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలో రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టనున్నది. ఆ రోజు సాయంత్రమే ఆయన మక్తల్ చేరుకోనున్నారు. ఇక ఆ తర్వాత మూడు రోజుల పాటు రాహుల్ యాత్రకు బ్రేక్ పడనున్నది. తొలుత అక్టోబర్ 24, 25 మాత్రమే దీపావళి కోసం విరామం ఇద్దామని అనుకున్నారు. కానీ మారిన షెడ్యూల్ ప్రకారం మూడు రోజులు (అక్టోబర్ 26 కూడా) దీపావళి బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలంగాణ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ తెలిపారు. నవంబర్ 27న తిరిగి మక్తల్ నుంచే భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం కానున్నది.

నవంబర్ 1న పాదయాత్ర హైదరాబాద్ శివారుకు చేరుకోనున్నది. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు శంషాబాద్ మాతా దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటలకు బహదూర్ పురలోని లెగసీ ప్యాలెస్ వద్ద బ్రేక్ ఫాస్ట్ కోసం రాహుల్ ఆగనున్నారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి పురానాపూల్, గుడ్ విల్ హోటల్, హుస్సేనీ ఆలం రోడ్ మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గాంధీభవన్, మీదుగా రాత్రి 7.00 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు.

ఇందిరా గాంధీ విగ్రహం వద్ద రాహుల్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం తన పాదయాత్రను కొనసాగిస్తారు. రాత్రి 10 గంటల తర్వాత బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ఆయన బస చేస్తారు. తర్వాతి రోజు తిరిగి బోయిన్‌పల్లి నుంచి బాలానగర్, కూకట్‌పల్లి వై జంక్షన్, జేఎన్‌టీయూ, మియాపూర్ మీదుగా యాత్రను కొనసాగించనున్నారు. కాగా, నవంబర్ 4న మరోసారి యాత్రకు బ్రేక్ పడనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. సిటీలో ఎక్కువ దూరం నడవటం, ఎక్కువ మీటింగ్స్‌లో పాల్గొననుండటం వల్ల సంగారెడ్డి దాటిన తర్వాత రాహుల్ మరోసారి యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.

First Published:  18 Oct 2022 4:11 AM GMT
Next Story