Telugu Global
Telangana

బీఆర్ఎస్ టు కాంగ్రెస్..? క్లారిటీ ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే

2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా భద్రాచలంలో పోటీ చేసిన తెల్లం వెంకట్రావు.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2023లో మళ్లీ వీరిద్దరు అవే పార్టీల నుంచి తలపడ్డారు. ఈసారి విజయం వెంకట్రావుని వరించింది.

బీఆర్ఎస్ టు కాంగ్రెస్..? క్లారిటీ ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే
X

119 స్థానాల తెలంగాణలో కాంగ్రెస్ కౌంట్ 64. బీఆర్ఎస్ కౌంట్ 39. అయితే బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చినరోజే ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారుతున్నారనే వార్తలొచ్చాయి. అయితే తనపై సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనన్నారు వెంకట్రావు. తనకు టికెట్ ఇచ్చింది కేసీఆర్ అని, తనను నమ్మి, మళ్లీ పిలిచి టికెట్ ఇచ్చారని, జీవితాంతం కేసీఆర్ తోనే ఉంటానన్నారు. కేసీఆర్ అడుగు జాడల్లోనే నడుస్తానని క్లారిటీ ఇచ్చారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో 9 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ కీలక నేత అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడిగా తెల్లం వెంకట్రావుకు పేరుంది. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరుతారని జోరుగా వార్తలు వినిపించాయి. దీంతో పార్టీ మార్పు వార్తలపై ఆయన నేరుగా క్లారిటీ ఇచ్చారు. తాను కేసీఆర్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. గతంలో తాను కాంగ్రెస్ లో చేరినప్పటి ఫొటోలను ఇప్పుడు కావాలని కొందరు వైరల్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా భద్రాచలంలో పోటీ చేసిన తెల్లం వెంకట్రావు.. కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2023లో మళ్లీ వీరిద్దరు అవే పార్టీల నుంచి తలపడ్డారు. ఈసారి విజయం వెంకట్రావుని వరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీయగా.. భద్రాచలంలో మాత్రం గతంలో కాంగ్రెస్ సొంతం చేసుకున్న సీటుని ఈసారి బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం విశేషం. తెల్లం వెంకట్రావు విజేతగా నిలిచారు. ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

సరిగ్గా ఎన్నికల ముందు తెల్లం వెంకట్రావు.. పొంగులేటితో కలసి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. భద్రాచలం టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ లో టికెట్ దొరక్కపోయే సరికి ఆయన తిరిగి బీఆర్ఎస్ లో చేరి భద్రాచలం టికెట్ దక్కించుకున్నారు. చివరకు విజయం సాధించారు. దీంతో ఆయనపై పుకార్లు బలంగా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆయన క్లారిటీ ఇవ్వడం విశేషం.


First Published:  4 Dec 2023 5:47 AM GMT
Next Story