Telugu Global
Telangana

మూడు గ్రామాలుగా భద్రాచలం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

భద్రాచలం జనాభా లక్ష వరకు ఉన్నది. దీంతో ఈ పట్టణాన్ని పంచాయతీగా కొనసాగించే వీలే లేదు. అదే సమయంలో ఆదివాసీ యాక్ట్ అమలులో ఉన్నందున మున్సిపాలిటీగా కూడా మార్చలేరు.

మూడు గ్రామాలుగా భద్రాచలం.. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
X

తెలంగాణలో టెంపుల్ టౌన్‌గా పిలుచుకునే భద్రాచలం ఇకపై మూడు గ్రామాలుగా కొనసాగనున్నది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇకపై భద్రాచలం రెవెన్యూ విలేజీలో భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్‌లుగా పాలన కొనసాగనున్నది. సారపాక గ్రామాన్ని కూడా సారపాక, ఐటీసీ‌గా విభజించారు.

భద్రాచలం జనాభా లక్ష వరకు ఉన్నది. దీంతో ఈ పట్టణాన్ని పంచాయతీగా కొనసాగించే వీలే లేదు. అదే సమయంలో ఆదివాసీ యాక్ట్ అమలులో ఉన్నందున మున్సిపాలిటీగా కూడా మార్చలేరు. దీంతో పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా విభజిస్తూ చట్ట సవరణ చేశారు. దీనికి సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ శనివారం ఆమోదం తెలిపింది.

మరోవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించారు. ప్రస్తుతం గురుకుల కళాశాలల్లో వ్యవసాయ కోర్సులు ప్రవేశపెట్టాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంది. దీని వల్ల పలు ఇబ్బందులు కూడా ఎదరవుతున్నాయి. ఇకపై అలాంటి అవసరం లేకుండా కోర్సులను నేరుగా విద్యాలయాలనే నిర్వహించుకునేలా.. అగ్రకల్చర్ యూనివర్సిటీ బిల్లులో సవరణ చేశారు. కాగా వీటితో పాటు మరి కొన్ని బిల్లులను కూడా ఇరు సభలు పాస్ చేశాయి.

ఈ బిల్లులన్నింటికీ గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే చట్టరూపం దాలుస్తాయి. కాగా, ఇప్పటికే గవర్నర్ వద్ద కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత సమావేశాల్లోనే 8 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై వద్దకు పంపినా ఇప్పటి వరకు ఆమోద ముద్ర వేయలేదు. ప్రస్తుతం గవర్నర్ వద్ద 1) తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు, 2) ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసే బిల్లు, 3) జీఎస్టీ చట్ట సవరణ, 4) ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, 5) మున్సిపల్‌ చట్ట సవరణ, 6) పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ, 7) ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు, 8) మోటర్‌ వెహికిల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు పెండింగ్‌లో ఉన్నాయి.

First Published:  11 Feb 2023 1:22 PM GMT
Next Story