Telugu Global
Telangana

సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర : సీఎం కేసీఆర్

దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో మనం నంబర్ 1గా ఉన్నాము. ఇదంతా గత తొమ్మిదేళ్లుగా చేసిన కృషి ఫలితమే అని సీఎం కేసీఆర్ చెప్పారు.

సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర : సీఎం కేసీఆర్
X

సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర. ఈ రోజు ఎన్నో కొత్త భవనాలు జిల్లా కేంద్రంలో ప్రారంభించుకున్నాము. ఇందుకు ప్రభుత్వ అధికారులకు, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనంతో పాటు ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం, సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం అక్కడి సమావేశ మందిరంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన 23వ కలెక్టరేట్ ఇదే అని కేసీఆర్ చెప్పారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో మనం నంబర్ 1గా ఉన్నాము. ఇదంతా గత తొమ్మిదేళ్లుగా చేసిన కృషి ఫలితమే అని చెప్పారు. జిల్లాల్లో ఇంత చక్కని భవనాలు నిర్మించుకొని, పరిపాలనను ప్రజల వద్దకు తీసుకొని వెళ్లడానికి కారణం ఆయా జిల్లాల మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులే కారణమని సీఎం కేసీఆర్ అన్నారు.

మనం ఎంతో ప్రగతి సాధించాము. ఇక్కడితో చాలు అనుకొని ఆగిపోవద్దు. మనం ఎంత సాధించినా.. ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. ప్రగతి ప్రస్థానం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి.. దాన్ని కొనసాగించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా పట్టుబట్టి నీళ్లు తీసుకొని వచ్చాము. ఆనాడు జిల్లా ఫ్లోరోసిస్ బాధితుల వెతలతో నిండిపోయి ఉండేది. సాక్షాత్తు ఆనాటి ప్రధాని వాజ్‌పేయి వద్దకే స్వామి అనే బాధితుడిని తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోబెట్టి చూపించారు. ఇందు కోసం ఆనాడు దుశ్చర్య సత్యనారాయణ బ్యాంకు జాబ్ కూడా వదిలేసి సమాజం కోసం పోరాడారు. ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటేనే కన్నీళ్లు వస్తాయి. కానీ, ఈ రోజు జీరో ఫ్లోరైడ్ ఘనతను తెలంగాణ సాధించింది. ఇందులో మన ఇంజనీర్ల కృషి ఎంతో ఉన్నదని కేసీఆర్ ప్రశసింసించారు.

సూర్యపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకున్న సమయంలో అక్కడ విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి కేరింతలు చూస్తుంటే చాలా ముచ్చటేసిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జిల్లాకొక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. వచ్చే ఏడాదికి ప్రతీ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు.



First Published:  20 Aug 2023 11:41 AM GMT
Next Story