Telugu Global
Telangana

అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే.. అవార్డులు సొంతమవుతున్నాయి : మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసే విషప్రచారాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు విషయ పరిజ్ఞానంతో బుద్ది చెప్పాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.

అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే.. అవార్డులు సొంతమవుతున్నాయి : మంత్రి హరీశ్ రావు
X

అభివృద్ధి అనేదే మన ఆయుధం.. అబద్దాలు ప్రచారం చేసే వాళ్ల మీద అభివృద్ధి అనే ఆయుధాన్ని ఉపయోగిద్దామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే అభివృద్ధిని మనం ప్రచారం చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అభివృద్ధిని చేసి చూపిస్తున్నాం కాబట్టే.. ఇవాళ అనేక అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం సొంతమవుతున్నాయని గుర్తు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

తెలంగాణలో ఏమీ జరగలేదు, అభివృద్ధే లేదని కొంత మంది విషం చిమ్ముతున్నారు. అసలు ఏమీ కాకపోతేనే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందా అని ప్రశ్నించారు. 3 శాతం జనాభా ఉంటే.. పంచాయతీరాజ్ శాఖలో 33 శాతం అవార్డులు మనకే వచ్చాయని మంత్రి చెప్పారు. మిషన్ భగీరథ, ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, పరిశ్రమల స్థాపన, ఐటీ రంగంలో అనేక అవార్డులు వచ్చాయి. పని చేయకపోతేనే ఇలా అవార్డులు వచ్చాయా? అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న విధానాలకే అవార్డులు వస్తున్నాయని హరీశ్ రావు అన్నారు.

ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. అప్పట్లో 10కి తొమ్మిది జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎంత వెనుకబడ్డదో అర్థం చేసుకోవచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒక్క హైదరాబాద్ తప్ప తెలంగాణ మొత్తం వెనుకబడిందని ప్లానింగ్ కమిషన్ చెప్పింది. అదీ కాంగ్రెస్ పార్టీ ఘనత. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలోని 33 జిల్లాలు కూడా దేశంలో నెంబర్ 1గా నిలిచాయని చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేసే విషప్రచారాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు విషయ పరిజ్ఞానంతో బుద్ది చెప్పాలని సూచించారు. ఈ మధ్య హిమాచల్‌ప్రదేశ్ సీఎం ఒకరు వచ్చి తెలంగాణలో ఉద్యోగాలే రావడం లేదు.. ఇక్కడ అంతా నిరుద్యోగం ఉందని వ్యాఖ్యానించారు. నేను ఒకటి చెప్తున్నా.. తెలంగాణలో నిరుద్యోగం ఉన్న మాట వాస్తవమే.. అయితే అది తెలంగాణ కాంగ్రెస్‌లో ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం గురించే ఆయన ప్రస్తావించి ఉంటారని అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయి. నిన్ననే 1000కి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసి నియామక పత్రాలు అందించామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కాంగ్రెస్ పాలన బాగాలేదు కాబట్టే కేసీఆర్‌ను రెండు సార్లు తెలంగాణ ప్రజలు గద్దెను ఎక్కించారని మంత్రి చెప్పారు. మళ్లీ రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు.

బీజేపీ వాళ్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్లు తెలంగాణలో అమలు అవుతున్న పథకాలనే కాపీ కొడుతున్నారని చెప్పారు. మిషన్ కాకతీయలో మనం చెరువులు బాగు చేసుకుంటే.. అదే పథకాన్ని అమృత్ సరోవర్ అని అమలు చేస్తున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని నకలు కొట్టి హర్ ఘర్‌కో జల్ అని పేరు మార్చి అమలు చేస్తున్నారు. అంటే దేశమంతా తెలంగాణ మాడల్‌ను అనుసరిస్తున్నదనడానికి ఇదే నిదర్శనం అన్నారు.

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఏవైనా చిన్నచిన్న మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టి.. పార్టీ కోసం పని చేయాలని.. అందరం కలిసి కట్టుగా ఉంటేనే ఎన్నికలను ధీటుగా ఎదుర్కోగలమని అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


First Published:  26 May 2023 9:24 AM GMT
Next Story