Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో మొదలైన బీసీ వర్సెస్ రెడ్డి పంచాయితీ

అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు కేటాయించాలని బీసీ నాయకులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 35 సీట్ల వరకు కేటాయిస్తామని అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్‌లో మొదలైన బీసీ వర్సెస్ రెడ్డి పంచాయితీ
X

తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన టికెట్ల పీఠముడి కాంగ్రెస్‌లో ఇంకా వీడలేదు. వారం రోజులుగా ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ తొలి విడత జాబితా కోసం చర్చోపచర్చలు చేస్తోంది. ఆశావహలు తమదైన దారుల్లో టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే తొలి లిస్టు అంటూ కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. స్క్రీనింగ్ కమిటీ వీళ్ల పేర్లను ఖరారు చేసిందో లేదో తెలియదు కానీ.. కాంగ్రెస్‌లో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయితీకి అయితే ఆజ్యం పోసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు కేటాయించాలని బీసీ నాయకులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 35 సీట్ల వరకు కేటాయిస్తామని అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. కానీ ఫస్ట్ లిస్ట్ పేరిట చక్కర్లు కొడుతున్న పేర్లలో కీలకమైన బీసీ నాయకుల పేర్లు లేకపోవడం ఇప్పుడు కొత్త పంచాయితీకి తెర తీసింది. కాంగ్రెస్‌లో కీలక నాయకులుగా ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్లు కనపడలేదు.

కాంగ్రెస్ విడుదల చేసే తొలి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారని గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటిచ్చారు. కానీ ఇప్పుడు కీలకమైన బీసీ నాయకుల పేర్లే లేకపోవడంతో ఆ సామాజిక వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే క్షేత్ర స్థాయిలో బీసీ నాయకులు, కార్యకర్తలే పని చేయాలని.. అలాంటప్పుడు మా నాయకుల పేర్లే పక్కకు పెడతారా అని మండిపడుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్ల డామినేషన్ ఎక్కువయ్యిందని.. వీళ్లే కావాలని బీసీ నాయకులను ఎదగనీయడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. కావాలనే బీసీ నాయకుల పేర్లు మొదటి లిస్టులో లేకుండా చేశారని.. తద్వారా వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అంటున్నారు. కాగా, బీసీ నాయకులు కోరిన సీట్లలో ఇంకా సర్వే జరుగుతోందని.. అందుకే వాళ్ల పేర్లు మొదటి లిస్టులో చేర్చలేదని వారికి సర్ధిచెప్పినట్లు తెలుస్తున్నది.

చాలా చోట్ల బీసీ నాయకులకు పోటీగా రెడ్డి నాయకులు టికెట్లు ఆశిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న రెడ్డి నాయకులు సర్వేలను కూడా ప్రభావితం చేస్తున్నారని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తూ.. బీసీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అంటున్నారు. మొత్తం రెడ్లకే టికెట్లు ఇస్తే.. ఇక బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌కు తేడా ఏముందని విమర్శిస్తున్నారు.

కీలకమైన బీసీ నాయకులకు టికెట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్థులు ఓడిపోవడానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంత మంది నాయకులు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లే బీసీలకు టికెట్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీనే బీసీలకు అధికంగా టికెట్లు ఇవ్వాలని చెప్పినా.. ఇప్పుడు అందుకు విరుద్దంగా రెడ్లు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్లాలని ఇప్పటికే ఢిల్లీలో ఉన్న బీసీ నాయకులు భావిస్తున్నారు.

మరోవైపు మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్‌లు సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలకు భట్టి విక్రమార్క కూడా వెళ్తుండటంతో ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.


First Published:  25 Sep 2023 7:31 AM GMT
Next Story