Telugu Global
Telangana

బీసీ బంధు మన సీఎం కేసీఆర్ : మంత్రి హరీశ్ రావు

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడిన రూ.1 లక్ష చెక్కులను సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

బీసీ బంధు మన సీఎం కేసీఆర్ : మంత్రి హరీశ్ రావు
X

బీసీ కుల వృత్తులను కాపాడటానికి వారికి రూ.1 లక్ష రూపాయల ఆర్థిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. బ్యాంకుల ద్వారా ఎలాంటి ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండానే సీఎం కేసీఆర్ అర్హులైన ప్రతీ ఒక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు. అందుకే మన సీఎం కేసీఆర్‌ను అందరూ బీసీ బంధు అని పిలుచుకుంటున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేయబడిన వారికి రూ.1 లక్ష చెక్కులను సిద్దిపేటలోని మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్ బీసీ కుల వృత్తులు చేసుకునే వారికి చేయూతను అందించాలనే ఉద్దేశంతోనే నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, నేతన్నలతకు 50 శాతం సబ్సిడీతో నూలు, ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం, చేనేత మిత్ర వంటి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మత్స్యకారుల కోసం ఉచిత చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వేశామని చెప్పారు.

మత్స్యకారుల కోసం లూనాలు, మోపెడ్లు పంపిణీ చేశామని.. గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేశామని.. గతంలో ఉన్న బకాయిలు కూడా మాఫీ చేశామని చెప్పారు. సొసైటీ పునరుద్ధరణ చేయడమే కాకుండా.. సిద్దిపేటలో మోడల్ దోబీ ఘాట్ నిర్మాణం చేపట్టామని మంత్రి చెప్పారు. కుమ్మరుల అభివృద్ధి కోసం సిద్దిపేటలో రూ.2.20 కోట్లతో రాష్ట్రంలోనే తొలి సారిగా మట్టి కుండలు, వంట పాత్రలు, గ్లాసులు తయారీకి మోడల్ ప్రాజెక్ట్ చేపట్టామని గుర్తు చేశారు.

తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో మొత్తం 330 రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే ఉండగా.. ఇవ్వాళ 1012కి అవి పెరిగాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. బీసీ విద్యార్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. బీసీలకు అందిస్తున్న అనేక పథకాలను అందరూ ఉపయోగించుకోవాలని హరీశ్ రావు సూచించారు.

First Published:  9 Aug 2023 10:16 AM GMT
Next Story