Telugu Global
Telangana

వివక్షకు పరాకాష్ట 'బయ్యారం ఉక్కు': 2014 నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది?

బయ్యారం ఉక్కుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణలో మంటలు పుట్టించాయి. తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ సర్కార్ చూపిస్తున్న వివక్షకు ఇది పరాకాష్ట అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు 2014 నుంచి బయ్యారం ఉక్కుపై ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

వివక్షకు పరాకాష్ట బయ్యారం ఉక్కు: 2014 నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేసిన హామీల్లో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు ఒకటి. అనేక విభజన హామీల లాగే దాని పట్ల కూడా కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ల‌క్ష్యంగానే కాదు వివక్షాపూరితంగా వ్యవహరిస్తూ వస్తోంది. దీన్ని రాజకీయ పగ అని కూడా అనవచ్చు.

2014 నుంచి బయ్యారం ఉక్కుపై బీజేపీ సర్కార్ మొండిగానే వ్యవహరిస్తోంది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ చెబుతూ వస్తోంది.

పార్లమెంట్‌తో సహా వివిధ వేదికలపై తెలంగాణ ప్రభుత్వ ఈ డిమాండ్‌ను లేవనెత్తిన ప్రతిసారీ కేంద్రం 'నాన్‌ఫీజిబిలిటీ' అని చెప్తోంది.

2015లో, ఎంపీ మహ్మద్ అలీఖాన్ రాజ్యసభలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు, అప్పటి కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉందని చెప్పారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాల ను పరిశీలించడానికి జూన్ 2, 2014న ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ డిసెంబర్ 1, 2014న తన నివేదికను సమర్పించింది.

ఆ నివేదిక ప్రకారం, ప్రతిపాదిత కాన్ఫిగరేషన్‌లతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదు. అయితే 2016 అక్టోబర్‌లోమంత్రి విష్ణు దేవ్ సాయి, తెలంగాణలో ఉక్కు కర్మాగారం ఏర్పాటును ఆర్థికంగా లాభదాయకంగా మార్చే మార్గాలను సూచించడానికి, అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలను గుర్తించి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

ఆ టాస్క్ ఫోర్స్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, SAIL, RINL, NMDC, MECON, MSTC భాగంగా ఉన్నారు. మళ్లీ 2018 మార్చిలో, లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు, మంత్రి విష్ణు దేవ్ సాయి , ఈ విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను (తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ) భాగస్వామ్యం చేయాలని నిర్ణయించుకున్నాము. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాల నివేదిక పూర్తవుతుందని రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

కాగా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన సర్వేలో బయ్యారంలో 300 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాలను గుర్తించింది. కానీ కేంద్రం, అది కుదరదని, ఖనిజాల నాణ్యతను సరిగా లేదని చెప్తూ ఉంది. 2014 నుంచి ఇదే పరిస్థితి, ఎనిమిదేళ్ల తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ ఆచరణ సాధ్యంకాదన్న తన వైఖరికి కట్టుబడే ఉంది.

కేంద్రం పదే పదే నిరాకరించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టు వదలలేదు. బయ్యారం నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న చత్తీస్‌గఢ్‌లోని బైలాడి వద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది.

బయ్యారం వరకు ఖనిజాన్ని రవాణా చేయడానికి స్లర్రీ పైప్‌లైన్ లేదా రైల్వే ట్రాక్ వేయవచ్చు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి సూచనలు చేశారు.

కేంద్రం వివక్ష వైఖరితో విసిగిపోయిన పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్‌కు రాసిన లేఖలో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు ఖనిజాన్ని రవాణా చేసేందుకు ఎన్‌ఎండిసి అంగీకరించిందని ఎత్తి చూపారు.

స్లర్రీ పైప్‌లైన్ లేదా రైల్వే ట్రాక్ వేయడానికి అయ్యే ఖర్చును పంచుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ పదేపదే విజ్ఞప్తులు చేసినా కేంద్రం స్పందించడం లేదని కేటీఆర్ అన్నారు.

జిఎస్‌ఐ సర్వేతో పాటు, మెటలర్జికల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌లు ఖమ్మం, పొరుగు ప్రాంతాలలో సర్వే నిర్వహించి, పెల్లెటైజేషన్ ప్లాంట్ లేదా స్క్రాప్ ఆధారిత ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. నాటి కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ కూడా ఎన్‌ఎండీసీ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కొత్తగూడెం, పాల్వంచలో పెల్లెటైజేషన్, స్క్రాప్ బేస్డ్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించినా నేటికీ ఎలాంటి చర్యా చేపట్టలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

మరో వైపు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో ఉక్కు కర్మాగారాల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నది కానీ తెలంగాణ విజ్ఞప్తులను మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది.

రూర్కెలా, బర్నాపూర్, దుర్గాపూర్, బొకారో, సేలంలలో ఉక్కు కర్మాగారాల విస్తరణ, అభివృద్ధికి రూ.71 వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు.

బయ్యారం ఉక్కు కర్మాగారం ఆర్థికంగా సాధ్యపడదన్న పాత పల్లవినే పాడిన‌ కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి తెలంగాణ గాయాలపై మరోసారి ఉప్పు రుద్దారు.

First Published:  28 Sep 2022 7:17 AM GMT
Next Story