Telugu Global
Telangana

నేటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం

పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

నేటి నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం
X

పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని మహిళల అస్తిత్వానికి అద్దం పడుతూ వారి సృజనాత్మకశక్తిని ప్రతిబింబిస్తుంది. పూల అమరిక నుంచి పాటల పాడటం వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమౌతుంది. నేటి నుంచిబతుకమ్మ పండుగ ప్రారంభం కానున్నది. బతుకమ్మలో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకం. తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేక ఫలహారాలు,నైవేద్యం సమర్పించడమనేది ఆనవాయితీగా వస్తున్నది.

బతుకమ్మను వివిధ రకాల పూలతో పేరుస్తారు. పూలను పేర్చడం ఓ సృజనాత్మక ప్రక్రియ. తంగేడు, బంతి, గునుగు, తీగమల్లె, గుమ్మడి, పోకబంతి, కనకాంబరం తదితర పూలు బతుకమ్మలో కొలువుదీరుతాయి. పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి, చుట్టూ దీపాలతో తీర్చిదిద్దడం సంప్రదాయం. ఏమేమి పువ్వొప్పనే గౌరమ్మ, ఒక్కేసి పువ్వేసి చందమామ చిత్తు చిత్తుల బొమ్మ, కలవారి కోడలు ఉయ్యాలో, శ్రీరాముడు సీత ఉయ్యాలో, ఒక్కడే మాయమ్మ వచ్చన్నపోడాయే, ఇద్దరక్క చెల్లెల్ల ఉయ్యాలో ఇలా అనేక పాటలు వినిపిస్తాయి. ప్రతి పాట వెనుక కష్టం, ఆనందం దాగి ఉంటాయి.

First Published:  2 Oct 2024 5:33 AM GMT
Next Story