Telugu Global
Telangana

రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రేపటి నుంచే మొదలుకానున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు
X

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రేపటి నుంచే మొదలుకానున్నాయి. ఈ నెల 10 వరుకూ జరగనున్నాయి. బతుకమ్మ పండగంటే ఊరు,వాడంతా సందడిగా మారిపోతుంది.మహిళలు తీరొక్క పూలతో గౌరమ్మను పూజిస్తారు. బతుకమ్మ పాటలతో, ఆటలతో హడావుడి పండుగ వాతావరణం ఉంటుంది.మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపుల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. తొమ్మిది రోజులు ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుని కన్నులపండువగా పూలపండుగ జరుపుకుంటారు.

బతుకమ్మలు చేసి ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ ఆడిపాడతారు. చివరిరోజైన సద్దుల బతుకమ్మ రోజు నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ సందర్బంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తరతరాలుగా మహిళా సామూహిక శక్తికి, ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు.

1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ

2వ రోజు అటుకుల బతుకమ్మ

3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ

4వ రోజు నాన బియ్యం బతుకమ్మ

5వ రోజు అట్ల బతుకమ్మ

6వ రోజు అలిగిన బతుకమ్మ

7వ రోజు వేపకాయల బతుకమ్మ

8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ

9వ సద్దుల బతుకమ్మ.

First Published:  1 Oct 2024 3:54 PM GMT
Next Story