Telugu Global
Telangana

బర్రెలక్కే నయం.. సీపీఎం పరిస్థితి దారుణం

కాంగ్రెస్ తో కలసి ప్రయాణం చేసిన సీపీఐ గౌరవంగా సింగిల్ సీటు సాధించి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వగా.. సింగిల్ సీటు ఆఫర్ నచ్చక ఏకంగా 19 స్థానాల్లో నామినేషన్లు వేయించిన సీపీఎం పరిస్థితి దారుణంగా తయారైంది. సీపీఎం రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి 4వేల ఓట్లతో ఘోర అవమానం పాలయ్యారు.

బర్రెలక్కే నయం.. సీపీఎం పరిస్థితి దారుణం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమని తాము ఎక్కువగా అంచనా వేసుకుని ఒంటరి పోరుకి దిగిన సీపీఎం పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇదే అతి పెద్ద ఉదాహరణ. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వయంగా పాలేరులో పోటీ చేశారు. పాలేరు విజేత కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 40వేలకు పైగా మెజార్టీ వచ్చింది. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రంకు వచ్చిన ఓట్లు కేవలం 4వేలు. విజయం సాధించకపోగా, కాంగ్రెస్ విజయావకాశాలను ఏమాత్రం దెబ్బకొట్టలేకపోయారు తమ్మినేని. అదే సమయంలో కాంగ్రెస్ తో జట్టుకట్టిన సీపీఐ ఒక అసెంబ్లీ స్థానం కైవసం చేసుకోవడం విశేషం.

బర్రెలక్క కాస్త నయం..

ఇటు కొల్లాపూర్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించింది. ఆమెకు 5వేల ఓట్లు వచ్చాయి. సోషల్ మీడియాలో బర్రెలక్క తరపున యువత భారీ ప్రచారం నిర్వహించింది. ఓ స్వతంత్ర అభ్యర్థికి, రాజకీయ అనుభవం లేని ఓ యువతికి ఆ మాత్రం ఓట్లు రావడం విశేషం. అదే సమయంలో సీపీఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు పాలేరులో వచ్చిన ఓట్లు.. బర్రెలక్క కంటే తక్కువ కావడం మరో విశేషం.

విలక్షణ తీర్పు..

తెలంగాణ ఓటరు విలక్షణ తీర్పునిచ్చారు. గెలుపు గ్యారెంటీ అనుకున్నవారు కూడా ఈసారి ఓటమిపాలయ్యారు. ఆశలు లేనివాళ్లు చాలామంది గెలిచి చూపించారు, తమ ఉనికి చాటుకున్నారు. రాగాపోగా.. కాంగ్రెస్ తో కలసి ప్రయాణం చేసిన సీపీఐ గౌరవంగా సింగిల్ సీటు సాధించి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వగా.. సింగిల్ సీటు ఆఫర్ నచ్చక ఏకంగా 19 స్థానాల్లో నామినేషన్లు వేయించిన సీపీఎం పరిస్థితి దారుణంగా తయారైంది. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 4వేల ఓట్లతో ఘోర అవమానం పాలయ్యారు.


First Published:  3 Dec 2023 12:31 PM GMT
Next Story