Telugu Global
Telangana

క్రమశిక్షణ తప్పితే వేటు వేస్తాం.. తెలంగాణ బీజేపీ నాయకులకు బన్సల్ వార్నింగ్!

బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలను త్వరగా పరిష్కరించుకోవాలని, క్రమశిక్షణతో ఉండకపోతే వేటు వేస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ హెచ్చరించారు.

క్రమశిక్షణ తప్పితే వేటు వేస్తాం.. తెలంగాణ బీజేపీ నాయకులకు బన్సల్ వార్నింగ్!
X

తెలంగాణ బీజేపీ నాయకులకు అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అగ్రనాయకులు వ్యూహాలు సిద్ధం చేయగా.. రాష్ట్ర నాయకులు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వర్గ విభేదాలు ఇలాగే కొనసాగితే.. అధికారం మాట అటుంచితే.. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకే రాష్ట్ర నాయకులకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

బీజేపీ రాష్ట్ర నాయకుల మధ్య ఉన్న విభేదాలను త్వరగా పరిష్కరించుకోవాలని, క్రమశిక్షణతో ఉండకపోతే వేటు వేస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ బన్సల్ హెచ్చరించారు. పదవులు కావాలని పట్టుబట్టడం సబబు కాదని, ఇక్కడేం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని నేరుగానే చెప్పేశారు. ఢిల్లీలోని అధిష్టానం వద్దనో, మీడియాలోనో పదవులు కావాలని డిమాండ్ చేసే వాళ్లకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరించారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి.. పదవులు వాటంతట అవే వస్తాయని సూచించారు. కాగా, బన్సల్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ను ఉద్దేశించే బన్సల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని, కేంద్రంలోని బీజేనీ ప్రభుత్వం.. ప్రధాని మోడీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని.. అలా చేస్తే.. అధిష్టానం గుర్తించి వారి సామర్థ్యానికి తగిన పదవులు కట్టబెడుతుందని చెప్పారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అప్పుడే నాయకులందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీకి వచ్చి పదవుల కోసం పోరు పెట్టవద్దని.. మీకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చమని సూచించారు. క్రమశిక్షణ తప్పితే వేటు వేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కులాల వారీగా పార్టీలో పదవులు ఇవ్వడం కుదరదని కూడా తేల్చేశారు.

గత కొన్ని వారాలుగా తెలంగాణ బీజేపీలో సీనియర్ నాయకులు, కొత్తగా పార్టీలో చేరిన వారి మధ్య విభేదాలు నెలకొన్నాయి. తమకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని కొత్తగా పార్టీలో చేరిన వారు ఆరోపిస్తున్నారు. ఈటల రాజేందర్ ఏకంగా ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత అధిష్టానం బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. ఈ క్రమంలో సునిల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వానికి హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇక్కడి నాయకత్వం పెద్దగా ప్రయత్నించడం లేదని.. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు కూడా లేరని బీజేపీ నాయకత్వం ఆగ్రహంతో ఉన్నది. ఒకవైపు పార్టీలో ఇన్ని బలహీనతలు ఉండగా.. వాటిపై దృష్టి పెట్టకుండా పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడం కూడా అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. ఇకనైనా క్రమశిక్షణతో పని చేయాలని.. అలా కాకపోతే తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మరి ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకుల్లో మార్పు వస్తుందో రాదో వేచి చూడాలి.

First Published:  23 May 2023 4:51 AM GMT
Next Story