Telugu Global
Telangana

బండి సంజయ్ మూడో విడత 'ప్రజా సంగ్రామ పాదయాత్ర'.. టార్గెట్ వరంగల్

ఇతర పార్టీ నుంచి అసంతృప్తులను ఈ పాదయాత్ర ముగింపు రోజున చేర్చుకోవాలని ప్లాన్ చేశారు. ఒకవైపు బండి పాదయాత్ర సాగుతుండగానే.. పార్టీ చేరికలపై దృష్టి పెట్టనుంది.

బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర.. టార్గెట్ వరంగల్
X

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మూడో విడత 'ప్రజా సంగ్రామ పాదయాత్ర' ఇవ్వాల్టి నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో జరిగే బహిరంగ సభతో ప్రారంభం కానున్న యాత్ర.. వరంగల్‌లో ఈ నెల 26న జరిగే భారీ బహిరంగ సభతో ముగిసేలా ప్లాన్ చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం బహిరంగ సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్టీ జెండా ఊపి యాత్ర ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ.. ఈ పాదయాత్ర ద్వారా మరింత లబ్ది పొందాలని అనుకుంటుంది. ముఖ్యంగా కీలకమైన ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ పాదయాత్ర ఉపయోగపడేలా ప్లాన్ చేశారు. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. అంతకంటే రెట్టింపు జనాలతో భారీగా బహిరంగ సభను నిర్వహించి.. పాదయాత్ర ముగించాలని బండి సంజయ్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా మెజార్టీ సాధించవచ్చని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ ఈ ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే ఇతర పార్టీ నుంచి అసంతృప్తులను ఈ పాదయాత్ర ముగింపు రోజున చేర్చుకోవాలని ప్లాన్ చేశారు. ఒకవైపు బండి పాదయాత్ర సాగుతుండగానే.. పార్టీ చేరికలపై దృష్టి పెట్టనుంది. గతంలో చేరికలు ఉంటాయని చెప్పినా.. వలసల విషయంలో విఫలమయ్యారు. కానీ, ఈ సారి వరంగల్ బహిరంగ సభ నాటికి ముఖ్య నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేలా వ్యూహం రచిస్తున్నారు. పూర్తిగా వరంగల్ జిల్లాపై దృష్టిపెట్టాలని భావించినందునే పాదయాత్ర షెడ్యూల్ కూడా మార్చినట్లు తెలుస్తుంది.

రాబోయే 24 రోజులు బండి సంజయ్ పాదయాత్ర 12 నియోజకవర్గాల మీదుగా సాగనుంది. చివరి రోజు బహిరంగ సభకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరుకానున్నారు. తొలిరోజు సంజయ్ 10.5 కిలోమీటర్లు నడవనున్నారు. యాదగిరిపల్లి, గాంధీనగర్, యాదగిరిగుట్ట మీదుగా గణేష్‌నగర్, శుభం గార్డెన్ వరకు నడుస్తారు. లంచ్ బ్రేక్ అనంతరం పాతగుట్ట, గొల్లగుడిసె మీదుగా దాతారుపల్లి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. రాత్రికి బస్వాపూర్ చేసుకొని అక్కడే బస చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

First Published:  2 Aug 2022 3:24 AM GMT
Next Story