Telugu Global
Telangana

చివరికి ఉద్యోగులతో సున్నం.. బీజేపీ ఓటమి పరిపూర్ణం

టీఎన్జీవోలు అమ్ముడుపోయారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులు రగిలిపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు.

చివరికి ఉద్యోగులతో సున్నం.. బీజేపీ ఓటమి పరిపూర్ణం
X

18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గుట్టురట్టవడం బీజేపీ అపజయంలో తొలిమెట్టు..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు బెడిసికొట్టడం రెండో మెట్టు..

చివరిగా ఉద్యోగులతో గొడవ పెట్టుకోవడం మునుగోడులో బీజేపీ పతనానికి ఆఖరి అంకం..

అవును, ప్రస్తుతం ఉద్యోగులంతా బీజేపీకి వ్యతిరేకంగా మారారు. నిన్న మొన్నటి వరకు కొద్దో గొప్పో సానుభూతిపరులు ఉండేవారేమో కానీ, టీఎన్జీవోలు అమ్ముడుపోయారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగులు రగిలిపోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు.

అసలేమైంది..?

మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా అక్టోబరు 29న నల్గొండలోని టీఎన్జీవో భవన్‌ లో ఉద్యోగ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. ఇందులో టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, కార్యదర్శి శరవణ్‌ పాల్గొన్నారు. దీన్ని బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. టీఎన్జీవోలను ప్రభుత్వం ప్రలోభ పెడుతోందని మండిపడ్డారు బండి సంజయ్. అక్కడితో ఆగలేదు, టీఆర్ఎస్ కి టీఎన్జీవోలు అమ్ముడుపోయారంటూ నోరు జారారు. దీంతో టీఎన్జీవో సంఘం నేతలు ఆందోళనకు దిగారు.

బండికి వ్యతిరేకంగా ర్యాలీ..

ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్ లో ఉద్యోగ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టాయి. సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉద్యోగులు. అమ్ముడుపోయారంటూ ఉద్యోగులను, సంఘాల నేతలను ఉద్దేశించి బండి సంజయ్ కించపరిచేలా మాట్లాడారని, తమ మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే కేంద్రంలోని బీజేపీతో మాట్లాడి ఉద్యోగులపై ఆదాయ పన్ను భారం తగ్గించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఎన్జీవోతో టీఆర్ఎస్ కి సత్సంబంధాలున్నాయని, ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ దేనని అన్నారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బండి సంజయ్ కి హితవు పలికారు టీఎన్జీవో నేతలు.

ఉద్యోగుల తిరుగుబాటుతో బీజేపీ ఇరకాటంలో పడింది. ఉద్యోగులపై పగబట్టి బీజేపీ సాధించేదేమీ ఉండదు. ఉద్యోగులందరూ వ్యతిరేకం అయితే కచ్చితంగా ఆ ప్రభావం ఉప ఎన్నికలపై పడుతుంది. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఉద్యోగుల వ్యవహారం తేడా కొట్టడంతో బీజేపీ ఓటమి పరిపూర్ణం అనే వాదన వినపడుతోంది.

First Published:  1 Nov 2022 3:04 AM GMT
Next Story