Telugu Global
Telangana

బండి సంజయ్.. నీ ఇంట్లో కూడా కేసీఆర్ పథకాల లబ్ధిదారులు ఉన్నారు : మంత్రి ప్రశాంత్ రెడ్డి

చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని మంత్రి అన్నారు. ఆయన నేతృత్వంలో అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఎదిగిందని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

బండి సంజయ్.. నీ ఇంట్లో కూడా కేసీఆర్ పథకాల లబ్ధిదారులు ఉన్నారు : మంత్రి ప్రశాంత్ రెడ్డి
X

తెలంగాణ ప్రజలందరూ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులే అని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో నీ ఇంట్లో వాళ్లు, నీ దగ్గర బంధువులు కూడా లబ్ధిదారులుగా ఉన్నారని మంత్రి చెప్పారు. నీ దగ్గర బంధువులు కూడా దశాబ్ది వేడుకలు జరుపుకుంటారని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగుండదని.. నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని మంత్రి అన్నారు. ఆయన నేతృత్వంలో అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఎదిగిందని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా ఉన్న కేటీఆర్.. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఎంతో కృషి చేశారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన కృషి ప్రధాని మోడీ కూడా చేయలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవిత ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పిల్లలు ఉన్నత ఉద్యోగాలు, లగ్జరీ జీవితాలు వదులుకొని వచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడి.. ఎన్నో కేసులు ఎదుర్కొని, అరెస్టు అయి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

మంత్రి కేటీఆర్ కృషి కారణంగా రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు.. 18 వేల కంపెనీలు.. 16 లక్షల ఉద్యోగాలు లభించాయని అన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణాన్ని సీఎం కేసీఆర్ క్రియేట్ చేశారన్నారు. ఇంత చేస్తున్నా.. బీజేపీ నాయకులు మాత్రం కుటుంబ పాలన అని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ఇంత చేస్తుంటే.. ప్రధాని మోడీ మాత్రం తన స్నేహితుడు అదానీ కోసం పైరవీలు చేసి శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారత పరువును మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఆ పదవిని అదానీ కోసమే చేపట్టినట్టు.. దేశ సంపదనంతా అతనికి ధారాదత్త చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు మోడీ దేశానికి చేసిందేమిటో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీలో ఒలంపిక్ క్రీడాకారులు నిరసన చేస్తుంటే.. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సాక్షాత్తూ బీజేపీ ఎంపీపై ఆడపిల్లలు ఆరోపణలు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం క్రీడా పోటీలు పెట్టుకుంటూ, కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని మంత్రి అన్నారు. ఐదు నెలల్లో మేము కాదు.. నువ్వు, నీ మోడీ పత్తా లేకుండా పోతారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారని.. నీవు ప్రచారం చేసిన దగ్గర ఒక్క సీట్లో కూడా బీజేపీ గెలవలేదని బండి సంజయ్‌ని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. నీ వల్ల ఏమీ కాదని నీ చుట్టూ ఉన్న వాళ్లే చాటుకు నవ్వుతున్నారని.. బండి సంజయ్ అది ముందు తెలుసుకోవాలని అన్నారు.

First Published:  18 May 2023 1:02 PM GMT
Next Story