Telugu Global
Telangana

హమ్మయ్య.. బీజేపీలో ఒక సీటు ఖరారైంది..

బండిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసి రాష్ట్ర రాజకీయాలనుంచి పూర్తిగా తప్పించాలనుకుంది అధిష్టానం. కానీ ఆయనకు తెలంగాణ అసెంబ్లీపైనే ఇష్టం ఎక్కువగా ఉంది.

హమ్మయ్య.. బీజేపీలో ఒక సీటు ఖరారైంది..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కానీ.. అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్న బీజేపీ మాత్రం ఇంకా తొలి జాబితా విడుదల చేయలేదు. అభ్యర్థులే లేరు అంటూ ఓవైపు వైరి వర్గాలు దెప్పిపొడుస్తుంటే, మరోవైపు నామినేషన్ల ఆఖరు రోజు కూడా పేర్లు ప్రకటించడం మా స్ట్రాటజీ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ దశలో కరీంనగర్ టికెట్ ని తనకు తానే ప్రకటించుకున్నారు రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి, ఈసారి ఎమ్మెల్యే సీటుకి పోటీ చేస్తానంటున్నారు.

బండి మనసులో మాట..

బండి సంజయ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం తప్పించింది. ఆ పదవి కిషన్ రెడ్డికి అప్పగించింది. వాస్తవానికి ఇద్దరూ ఎంపీలే, అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కూడా ఉంది. బండిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసి రాష్ట్ర రాజకీయాలనుంచి పూర్తిగా తప్పించాలనుకుంది అధిష్టానం. కానీ ఆయనకు తెలంగాణ అసెంబ్లీపైనే ఇష్టం ఎక్కువగా ఉంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి వరుసగా ఓటమిపాలయ్యారు బండి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి పరువు దక్కించుకున్నారు. అయితే కరీంనగర్ అసెంబ్లీ సీటు ఆయన్ను ఊరిస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ సీటుకి పోటీ చేస్తానంటున్నారు బండి. ఎంపీగా ఉండి, ఎమ్మెల్యే స్థానం ఆశిస్తున్న ఆయనకు ఈసారయినా అదృష్టం కలిసొస్తుందా, లేక హ్యాట్రిక్ ఓటమిపాలవుతారా అనేది తేలాల్సి ఉంది.

ఆదిలాబాద్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన బండి సంజయ్.. అమిత్ షా సభ విజయవంతమైందని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఈసారి కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి తనకు పోటీ చేయాలని ఉందని చెప్పారు. అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానని అన్నారు. బండి కోరితే అధిష్టానం కాదంటుందని అనుకోలేం. అందుకే కరీంనగర్ స్థానం నుంచి ఆయన పోటీ ఖరారైందని అనుకోవాలి.

First Published:  11 Oct 2023 10:43 AM GMT
Next Story