Telugu Global
Telangana

బీఆర్ఎస్ బాటలో బీజేపీ.. 'బండి' దీక్ష ఫలించేనా..?

బీజేపీ రైతు దీక్ష అనడం కంటే ఇది కేవలం 'బండిదీక్ష' అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ని కాపీకొడుతూ కాస్త ముందుగా బండి మేల్కొన్నారు.

బీఆర్ఎస్ బాటలో బీజేపీ.. బండి దీక్ష ఫలించేనా..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ వివిధ పార్టీల ప్రచార అస్త్రాలు వేరు, ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ ప్రచార అస్త్రాలు వేరు. బీఆర్ఎస్ పాలనపై అప్పుడు కాంగ్రెస్, బీజేపీ విమర్శలు సంధించాయి. కాంగ్రెస్ ని నమ్మి రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి పాలనా పగ్గాలు అప్పగించారు. లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. అన్ని హామీలు అమలు చేయకపోయినా.. ఒక్కో పాయింట్ తీసుకుని ఆరు గ్యారెంటీలను మమ అనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు పూర్తి స్థాయిలో ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై ప్రతిపక్షాలు ఫోకస్ పెంచాయి. ఆల్రడీ బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో పని మొదలు పెట్టింది. కేసీఆర్ కూడా నేరుగా పొలంబాట పట్టారు. దీంతో బీజేపీలో హడావిడి మొదలైంది. బండి సంజయ్ ఏకంగా 'రైతు దీక్ష' అంటూ నిరసనకు దిగుతున్నారు.

'బండి దీక్ష'

బీజేపీ రైతు దీక్ష అనడం కంటే ఇది కేవలం 'బండిదీక్ష' అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ని కాపీకొడుతూ కాస్త ముందుగా బండి మేల్కొన్నారు. రైతులకోసం పోరాటం చేస్తానంటూ దీక్షలకు దిగుతున్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని, సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని, పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదని విమర్శిస్తూ.. బండి ‘రైతు దీక్ష’కు సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కేంద్రం వద్ద నాలుగు గంటలసేపు నిరాహార దీక్ష చేయబోతున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోడానికి బండి చెమటోడుస్తున్నారు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవన్న సంకేతాలతో ఆయన రైతుల సబ్జెక్ట్ తలకెత్తుకున్నారు. వాస్తవానికి గతంలో కూడా రైతుల అంశాన్ని బండి ఎప్పుడూ నేరుగా ప్రస్తావించలేదు, రైతుల తరపున పోరాటం చేయలేదు. బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలకు ప్రచారం లభించడం, ఇదే అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పడే అవకాశం ఉండటంతో బండి ఈవైపు టర్న్ తీసుకున్నారు. కరీంనగర్ రైతులు బండి దీక్షను ఏమేరకు నమ్ముతారనేది తేలాల్సి ఉంది.

First Published:  1 April 2024 3:21 AM GMT
Next Story