Telugu Global
Telangana

బండి గాంభీర్యం.. చివరకు ఏ స్థాయికి వెళ్లిందంటే..?

25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు బండి సంజయ్. అయితే వారెవరు, వివరాలేంటి అని అడిగితే మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు.

బండి గాంభీర్యం.. చివరకు ఏ స్థాయికి వెళ్లిందంటే..?
X

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది ఒకే ఒక సీటు. ఆ తర్వాత రెండు బై ఎలక్షన్లలో ఇద్దరు బీజేపీ తరపున గెలిచినా, మూడోసారి బొక్కబోర్లా పడింది కమలం పార్టీ. ఇటీవల కర్నాటకలో చావుదెబ్బ తిన్నది. ఈ ఏడాది జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని సర్వేలు చెబుతున్నాయి. అయితే బీజేపీ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని వదలట్లేదు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. ఏకంగా పాతికమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పే స్థాయికి చేరుకుంది.

25మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు బండి సంజయ్. అయితే వారెవరు, వివరాలేంటి అని అడిగితే మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు. కర్నాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో కూడా కనపడుతుందని, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి బీజేపీకి రెండో స్థానం కూడా దక్కదని సర్వేలు చెబుతుండే సరికి బండి కవర్ డ్రైవ్ లు మొదలు పెట్టారు. పాతికమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, యాభై మంది ఫోన్లు చేస్తున్నారని లేనిపోని డాంబికాలు పలుకుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే అది వేలిడిటీ అయిపోయిన పార్టీ అని సెటైర్లు పేల్చారు బండి సంజయ్. కాంగ్రెస్ ని జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ని గద్దె దించడం ఖాయమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బండికి సొంత పార్టీలోనే సెగ మొదలైంది. బండికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దూరమవుతుందనే వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్నారని అంటున్నారు నెటిజన్లు. పాతికమంది టచ్ లో ఉంటే పేర్లు చెప్పాలని సవాల్ విసురుతున్నారు వైరి వర్గాల నేతలు.

First Published:  14 Jun 2023 6:24 PM GMT
Next Story